
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: పక్కింట్లో నివసిస్తున్న పూజారి కామ దాహానికి నిండు నూరేళ్లు జంటగా బతకాల్సిన దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకా సాదరహళ్లి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ దారుణ ఉదంతం జరిగింది. లోకేశ్ (30), కౌసల్య (22) ఆత్మహత్య చేసుకున్న దంపతులు. వీరింటి పక్కనే నివసిస్తున్న మారమ్మ దేవాలయం పూజారి త్యాగరాజ్... కౌసల్యను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులపాటు బెంగళూరు తీసికెళ్లి సహజీవనం చేశాడు. తరువాత కౌసల్య పశ్చాత్తాపం చెంది భర్త ఇంటికి తిరిగి వచ్చేసింది.
భారీగా మోహరించిన పోలీసులు, ప్రజలు , కాలిపోతున్న పూజారి ఇల్లు
ఫేస్‌బుక్‌లో అసభ్య చిత్రాలు
కౌసల్య దూరమవడంతో ఆగ్రహించిన పూజారి త్యాగరాజ్ ఆమెతో గతంలో తీసుకున్న అభ్యంతరకర ఫోటోలను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో అసలే గుసగుసలాడుకుంటున్న గ్రామస్తులు ఈ సంఘటనతో మరింతగా చిన్నచూపు చూడసాగారు. ఈ అవమానం భరించలేని లోకేశ్, కౌసల్య ఇక చావే శరణ్యమనుకున్నారు. ఇద్దరూ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంటికి, వాహనాలకు నిప్పు
విషయం తెలుసుకున్న పూజారి తనకు బడితపూజ తప్పదని గ్రామం నుంచి పరారయ్యాడు. దంపతుల మృతితో అగ్రహోదగ్రులైన గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. అతడి కారుని కూడా కాల్చేశారు. ఈ మంటలకు దేవాలయం వద్ద నిలిపి ఉన్న ఒక భక్తునికి చెందిన స్విఫ్ట్‌కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు కాలిపోయాయి. గ్రామంలో ఉద్విగ్న పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మోహరించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య దంపతుల మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment