
బ్లాక్ టికెట్.. బ్లాక్ మార్కెట్.. బ్లాక్ మనీ.. ఈ పేర్లు తరచూ వింటూనే ఉంటాం. మరీ ఈ బ్లాక్ బిజినెస్ ఏంటి? దానికి నైజీరియన్లకు సంబంధం ఏమిటి? ఆ దందాతో మనం ఎలా నష్టపోతున్నాం? ఇవన్నీ తెలియాలంటే ఈ కథనంచదవాల్సిందే.
సాక్షి, సిటీబ్యూరో :లాటరీలు, బహుమతులు, పెళ్లి ప్రతిపాదనల పేరుతో సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్‌తో పాటు ఇటీవల కాలంలో వాట్సాప్ మెసేజ్‌లతో ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు చిక్కడం కష్టసాధ్యమవుతోంది. ఒకవేళ దొరికినా వారి నుంచి రికవరీలు తీసికట్టుగా ఉంటున్నాయి. రాజధాని కమిషనరేట్ల పరిధిలోని ప్రజలు సైబర్ నేరాల్లో కోల్పోతున్న మొత్తాల్లో గరిష్టంగా 5 శాతం మాత్రమే రికవరీ ఉంటోందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘బ్లాక్ బిజినెస్’. మెట్రో నగరాల్లో స్థిరపడిన నల్లజాతీయులు సైబర్ మోసాల ద్వారా ఆర్జించిన సొమ్మును వస్త్రాలు, వస్తువులుగా మార్చి తమ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
వివరాలకు మార్గాలెన్నో...
ఈ సైబర్ నేరగాళ్లలో అత్యధికులు ఆఫ్రికా దేశాలకు చెందిన నల్లజాతీయులే ఉంటున్నారు. వీరు ఆన్‌లైన్ మోసాలను ఈ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్, వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్‌లతో ప్రారంభిస్తారు. మెయిల్ ఐడీలు, ఫోన్ నంబర్లు సేకరించడానికి వారికి అనేక మార్గాలుంటున్నాయి. బహుమతులు, క్విజ్‌ల పేరుతో ఆన్‌లైన్‌లో చాలా సాధారణమైన ప్రశ్నల్ని అడుగుతూ వ్యక్తిగత వివరాలు పూరించమంటారు. మరోపక్క ఫ్రీ గిఫ్ట్ ఓచర్ల పేరుతో అనేక వాణిజ్య ప్రాంతాల్లో పేరు, నంబర్, మెయిల్ ఐడీలతో స్లిప్స్ నింపించి బాక్సుల్లో వేయించే విధానాలు ఇటీవల పెరిగాయి. ఇవన్నీ అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లకు చేరిపోతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా లక్ష ఫోన్ నంబర్లు/ఈ–మెయిల్స్ రూ.30 వేలకు విక్రయించే వెబ్‌సైట్లూ ఉన్నాయి. ఇలాంటి సైట్లకు డార్క్‌నెట్ అడ్డా. వీటి ఆధారంగా ముఠాలుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్లు పోలీసులకు ఆధారాలు చిక్కకుండా పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖాతాలకు బదులు వాలెట్స్
ఈ నైజీరియన్లు స్కీములు, పన్నులు, పెట్టుబడులంటూ బాధితుల నుంచి సొమ్ము స్వాహా చేయడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. ఒకప్పుడు కేవలం ఖాతాల్లోనే నగదు జమ చేయించుకునే వీళ్లు ఇటీవల కాలంలో వివిధ రకాలైన వాలెట్స్‌ను వాడుతున్నారు. వీటిని నైజీరియన్లే నేరుగా తెరిస్తే కేసు నమోదైనప్పుడు పోలీసులకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నైజీరియన్లు ఈ ఖాతాలు, వాలెట్స్ కోసం భారీ పథక రచన చేస్తున్నారు. ముంబై, బెంగళూర్, ఢిల్లీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బ్యాంకు ఖాతాలు/వాలెట్స్ తెరిచి, తమ వ్యాపారానికి సహకరిస్తే ప్రతి లావాదేవీలోనూ కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు రాజకీయ ప్రముఖుల నల్లధనాన్ని తాము వైట్ మనీగా మారుస్తామని, దాని కోసమే ఇవి అంటూ నమ్మబలికి వారిని ఒప్పిస్తున్నారు. ఈ రకంగా కమీషన్ తీసుకొని తమ ఖాతాలు/వాలెట్స్‌ను అప్పగించే వారిని సాంకేతిక పరిభాషలో ‘మనీమ్యూల్స్’ అంటారు.
వస్త్రాలు.. వస్తువులు
ఇలా చేయడం ద్వారా ఖాతాలు/వాలెట్స్‌ను తెరిచిన వారికి, ఏజెంట్లకు మధ్య... ఏజెంట్లకు, నైజీరియన్లకు మధ్య ఎలాంటి లింకు లేకపోవడంతో సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది. సైబర్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్మును నగదు రూపంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు పంపడం ఇబ్బందికరం. అలాగని ఇక్కడే ఏ రూపంలో ఉంచినా పోలీసులకు వీరు చిక్కినప్పుడు ఆ మొత్తాన్ని, వస్తువుల్నీ రికవరీ చేసేస్తారు. దీంతో మోసగాళ్లు బాధితుల నుంచి స్వాహా చేసిన సొమ్మును వస్తు/వస్త్ర రూపంలోకి మార్చేస్తున్నారు. వీటిని ఎగుమతుల పేరుతో తమ దేశానికి తరలిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ముఠాలో కొందరిని బిజినెస్ వీసాపై భారత్‌కు తీసుకొస్తున్నారు. వీరు ఎక్కువగా వస్త్ర వ్యాపారుల ముసుగులోనే తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుల నుంచి కాజేసిన దాంట్లో కొంత మొత్తాన్ని తమ వద్ద ఉంచుకొని, మిగిలిన దాంతో ఢిల్లీలో ఉన్న పాలికాబజార్, సరోజిని మార్కెట్, చాందినీ చౌక్‌లలో హోల్‌సేల్‌గా వస్త్రాలు, ఎగుమతికి ఇబ్బంది లేని వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని బిజినెస్ వీసాపై వచ్చిన వారికి అప్పగించడం ద్వారా కన్‌సైన్‌మెంట్ రూపంలో ఆయా ఆఫ్రికన్ దేశాలకు పంపిస్తున్నారు. ఈ కన్‌సైన్‌మెంట్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు అక్కడా ముఠా సభ్యులు ఉంటున్నారు. వీళ్లు అక్కడ మార్కెట్‌లో ఆయా వస్తువులు, వస్త్రాలు అమ్మి క్యాష్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే సైబర్ నేరాల్లో నగదు రికవరీ చేయడం అసాధ్యంగా మారుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఆలస్యం చేయొద్దు
సైబర్ నేరాల్లో నిందితుల నుంచి రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారింది. ఈ కేసుల్లో బాధితులు పోలీసుల్ని ఆశ్రయించడానికి ఆలస్యం చేస్తుండడమే ఇందుకు కారణం. ఈ మోసగాళ్ల బారినపడినవాళ్లు గరిష్టంగా 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే కొంతవరకు ఉపయుక్తం. నగదు ఆన్‌లైన్‌లో బదిలీ చేసినా, వాలెట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసినా అది క్లియర్ కావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. నేరగాళ్లు ఏటీఎం ద్వారానూ నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ ఒకేసారి విత్‌డ్రా చేయలేరు. ఈ అవకాశాల్ని వినియోగించుకొని బ్యాంకును సంప్రదించడం ద్వారా విత్‌డ్రా కాకుండా ఆపి రికవరీ చేయవచ్చు. అయితే అనేక సందర్భాల్లో బాధితులు ఫిర్యాదు చేయడానికి ఆలస్యం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చెబుతున్న మాటలు నమ్మడం వల్లే ఇలా జరుగుతోంది.– సైబర్‌క్రైమ్ పోలీసులు