సాక్షి, సిటీబ్యూరో: అతడో మధ్య తరగతి వ్యక్తి..న్యూ నల్లకుంటప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్‌నిర్వహిస్తున్నారు... తన కుమారుడికి ఫీజు చెల్లించడం కోసం కొంత మొత్తం తన బ్యాంకు ఖాతాలోఉంచుకున్నారు..దీని నుంచిరూ.85 వేలు శనివారం సైబర్‌నేరగాళ్ల పరమైంది..ఆయన ఆలస్యం చేయకుండా సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడం, అధికారులు తక్షణం స్పందించడంతో 48 గంటల్లో పోయిన మొత్తం తిరిగి బాధితుడి ఖాతాలోకి వచ్చేశాయి. మంగళవారం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చిన ఆయన తన కష్టార్జితాన్ని 48 గంటల్లోనే వెనక్కు రప్పించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్శిల్ కోసం ప్రయత్నిస్తే..
నగరంలోని న్యూ నల్లకుంట ప్రాంతానికి చెందిన పి.నందకుమార్ స్థానికంగా ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు గీతం కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. నందకుమార్‌కు వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్ ద్వారా రెండు బాక్సులు డెలివరీ కావాల్సి ఉంది. వీటి విషయం అగడటానికి ఆయన ఆ సంస్థ నెంబర్ కోసం శనివారం జస్ట్ డయల్‌కు కాల్ చేశారు. వారు రెండు నెంబర్లు ఇవ్వడంతో వాటిని నందకుమార్ సంప్రదించారు. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఆ రెండు బాక్సులు డెలివరీ కాలేదని, తమకు రూ.10 చెల్లిస్తే పంపిస్తామంటూ అవతలి వ్యక్తులు చెప్పారు. దీంతో నందకుమార్ ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధమని చెప్పడంతో సైబర్ నేరగాళ్లు ఆయన నుంచి డెబిట్‌కార్డ్ వివరాలతో పాటు కాస్సేపటికి ఆయన సెల్‌ఫోన్‌కు వచ్చిన పిన్ నెంబర్ కూడా తెలుసుకున్నారు. ఈ వివరాలతో నందకుమార్ డెబిట్‌కార్డును సైబర్ నేరగాళ్లు తమ గూగుల్ పే ఖాతాకు అనుసంధానించుకున్నారు. మొదట కేవలం రూ.10 మాత్రమే తీసుకున్న వాళ్ళు ఆపై మూడు దఫాల్లో రూ.85,588 కాజేశారు. స్వల్ప వ్యవధిలోనే ఈ మూడు లావాదేవీలు జరిగిపోయాయి.
అదే రోజు రాత్రి ఫిర్యాదు..
శనివారం సాయంత్రం ఇలా జరగడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చాడు. ఆ సమయంలో ఫిర్యాదు స్వీకరించినా కేసు నమోదు చేసే సిబ్బంది అందుబాటులో ఉండరు. అయితే ఆలస్యమైతే బాధితుడు నష్టపోతాడని భావించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ తక్షణం స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆయన తొలుత బాధితుడి నుంచి ప్రాథమిక వివరాలు సేకరించి ఆయన ఖాతా నుంచి డబ్బు ఫ్లిప్‌కార్ట్‌కు వెళ్లినట్లు గుర్తించారు. మూడు వస్తువులు షాపింగ్ చేసిన నిందితులు ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతా నుంచి లింకు చేసిన గూగుల్ పే ద్వారా చెల్లించారని తేల్చారు. దీంతో వెంటనే ఫ్లిప్‌కార్ట్ నోడల్ అధికారులకు సమాచారం ఇచ్చిన ప్రశాంత్ ఆ మూడు లావాదేవీలు రద్దు చేయించారు. తర్వాతి రోజు ఆదివారం రావడంతో... సోమవారం ఉదయం నందకుమార్ ఫిర్యాదును కేసుగా నమోదు చేశారు. మధ్యాహ్నానికే మూడు లావాదేవీల్లో రూ.85,588 ఫ్లిప్‌కార్ట్ నుంచి బాధితుడి ఖాతాలోకి వచ్చి చేరారు. దీంతో నందకుమార్ మంగళవారం మధ్యాహ్నం సైబర్ క్రైమ్ ఠాణాకు వచ్చి కృతజ్ఞతలు తెలిపారు.
సైబర్ నేరాల్లోనూ ‘గోల్డెన్ అవర్స్’
సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించడానికి గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. అయితే సైబర్ నేరాల్లోనూ బాధితులుగా మారిన వారి ఫిర్యాదు చేయడానికీ ‘గోల్డెన్ అవర్స్’ ఉంటాయి. నేరం బారినపడిన 24 గంటల్లోపు వచ్చిన తమకు సమాచారం ఇస్తే ఆ మొత్తం తిరిగి రప్పించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ లావాదేవీల్లో డబ్బు మర్చంట్ ఖాతాలుగా పిలిచే ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు వెళితేనే ఇది సాధ్యమవుతుంది. సైబర్ నేరగాళ్ళకు చెందిన వ్యక్తిగత వాలెట్స్, ఖాతాల్లోకి వెళితే మాత్రం కష్టసాధ్యమే. – కేవీఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ
ఆ డబ్బుపై ఆశలు వదులుకున్నా
శనివారం ఠాణాకు వచ్చేసరికి అధికారులు వెళ్ళిపోతున్నారు. రోడ్డుపైన నన్ను చూసి ఆగిన వాళ్ళు ఏమైందంటూ ప్రశ్నించి వెంటనే స్పందించారు. అయినప్పటికీ సైబర్ నేరాలు, ఆ నేరగాళ్ల విషయం విన్న తర్వాత నా డబ్బుపై ఆశలు వదులుకున్నా. కుమారుడికి ఫీజు చెల్లించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భావించా. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చూపిన చొరవ కారణంగా కేవలం 48 గంటల్లోనే నా డబ్బు తిరిగి వచ్చింది. మొత్తమ్మీద కేవలం రూ.10 మాత్రమే నష్టపోయా.– నందకుమార్, బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment