సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నెంబర్లకు ఉన్న క్రేజ్‌కు ఓ సైబర్ నేరగాడు తెలివిగా క్యాష్ చేసుకున్నాడు. వీటి కోసం అనేక మంది సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదిస్తుంటారని తెలుసుకుని దాని ఉద్యోగినే టార్గెట్‌గా చేశాడు. అతగాడు విసిరిన వల్లోపడి రూ.20 వేలు పోగొట్టుకున్న బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. గుజరాత్ నుంచి నగరానికి వచ్చి నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ దుండగుడు ఈ ఫ్రాడ్‌కు సూత్రధారిగా ఉన్నాడు. ఇతగాడు వేర్వేరు వివరాలతో రెండు ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. వీటిలో ఒకటి జియో సంస్థకు చెందిన ఫ్యాన్సీ నెంబర్. దీన్ని ఆధారంగా చేసుకుని వాట్సాప్‌లో ఫ్యాన్సీ నెంబర్స్ పేరుతో ఓ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఈ గ్రూప్‌లో తన రెండో నెంబర్‌ను వేరే వ్యక్తి పేరుతో సేవ్ చేసి, దాన్నీ యాడ్ చేసుకుని అడ్మిన్‌ను చేశాడు. ఇలా మోసానికి అవసరమైన సన్నాహాలు పూర్తి చేసుకున్న దుండగుడు ‘క్షేత్రస్థాయి’లోకి దిగాడు. అనేక మంది ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుతూ వివిధ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన ఔట్‌లెట్స్‌లోని ఉద్యోగుల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఎయిర్‌టెల్ సంస్థకు చెందిన అలాంటి ఓ ఔట్‌లెట్‌లో పని చేసే ఉద్యోగిని సంప్రదించిన ఈ మోసగాడు తనకు ఉన్న జియో ఫ్యాన్సీ నెంబర్‌ను పోర్ట్ చేయాలని కోరాడు.
ఆ పని చేస్తూ సదరు ఉద్యోగి ఈ ఫ్యాన్సీ నెంబర్ ఎలా పొందాలంటూ ప్రశ్నించాడు. వీటికోసం వాట్సాప్‌లో ఓ ప్రత్యేక గ్రూప్ ఉందని, తాను పంపే లింకు ద్వారా అందులో జాయిన్ అయితే వాటిని ఖరీదు చేసుకోవచ్చని నమ్మబలికాడు. దీంతో మోసగాడి నుంచి లింకు షేర్ చేయించుకున్న ఉద్యోగి దాని ద్వారా ఆ వాట్సప్ గ్రూప్‌లో చేరాడు. చివరలో ఐదు తొమ్మిదులు వచ్చే ఫ్యాన్సీ నెంబర్ కావాలంటూ గతంలో ఓ వినియోగదారుడు ఇతడిని అడిగాడు. ఆ విషయం దృష్టిలో పెట్టుకున్న ఈ ఉద్యోగి ఆ నెంబర్ కోసం ఈ వాట్సాప్ గ్రూప్‌లో సంప్రదించాడు. వెంటనే అడ్మిన్‌గా ఉన్న నెంబర్ ద్వారా జవాబు ఇవ్వడం ప్రారంభించిన మోసగాడు రూ.20 వేలు చెల్లిస్తే ఆ నెంబర్ కేటాయించేలా చేస్తానంటూ చెప్పాడు. ఈ మాటలు నమ్మిన ఉద్యోగి గూగుల్ పే ద్వారా ఆ మొత్తం పంపేశాడు. ఆ తర్వాత అడ్మిన్‌గా ఉన్న నెంబర్‌తో ఈ ఉద్యోగి నెంబర్‌ను బ్లాక్ చేసిన మోసగాడు, ఫోన్లకూ స్పందించడం మానేశాడు. దీంతో తనను అడ్మిన్‌గా ఉన్న వ్యక్తి మోసం చేశాడని భావించిన బాధితుడు తనకు ఆ గ్రూప్‌లో చేరడానికి లింకు షేర్ చేసిన వ్యక్తిని అతడి నెంబర్‌లో సంప్రదించి వివరణ కోరాడు. ఏమీ తెలియనట్లు వ్యవహరించిన మోసగాడు ఆ అడ్మిన్‌తో మాట్లాడతానంటూ మూడు రోజుల వ్యవధి కోరారు.
ఆ గడువు పూర్తయిన తర్వాత బాధితుడు మరోసారి ప్రయత్నించగా సదరు మోసకారి అడ్మిన్ తన నెంబర్ కూడా బ్లాక్ చేశాడంటూ చెప్పి.. ఆపై అతగాడూ బాధితుడి నెంబర్‌ను బ్లాక్ చేసేశాడు. అప్పుడు అనుమానం వచ్చిన బాధితుడు పరిశీలించగా... పోర్ట్ చేయాలంటూ తనను సంప్రదించి, వాట్సాప్ గ్రూప్ లింకు పంపిన వ్యక్తి సెల్‌ఫోన్ నెంబర్‌తోనే ఆ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయినటు గుర్తించాడు. మరోపక్క సాంకేతికంగా ఆరా తీయగా... ఆ నెంబర్‌తో పాటు గ్రూప్ అడ్మిన్ నెంబర్ కూడా ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్లు గ్రహించాడు. దీంతో అతగాడు పథకం ప్రకారం తనను మోసం చేశాడని భావించి గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో బాధితుడు నివసించే ప్రాంతం రాచకొండ పరిధిలోని బాలాపూర్ పోలీసుస్టేషన్ కిందికి వస్తుందని గుర్తించారు. దీంతో తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే చట్ట పరంగా ఇబ్బందులు వస్తాయని, ఎల్బీనగర్ చౌరస్తాలోని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించి పంపారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని ఆయన బాధితుడికి హామీ ఇచ్చారు. ఆ మోసగాడు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ ద్వారా మరికొందరూ మోసపోయే ప్రమాదం ఉందని, ఇలాంటి వాటి పట్ల అంతా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment