బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్‌ | Danger And Insecure Place For Night Time In Hyderabad | Sakshi
Sakshi News home page

బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్‌

Published Sat, Nov 30 2019 8:27 AM | Last Updated on Mon, Dec 2 2019 12:31 PM

Danger And Insecure Place For Night Time In Hyderabad - Sakshi

అసాంఘిక శక్తులకు అడ్డా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌ రహదారి,కార్మికనగర్‌ నిమ్స్‌మే మైదానం

మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్లలోని భూమి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తి నిర్మానుష్యంగా పొదలు, బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతంలో హత్యలు కూడా జరిగాయి. రెండేళ్ల క్రితం చాందిని జైన్‌ అనే యువతి స్నేహితుడితో కలిసి పీజేఆర్‌ ఎన్‌క్లేవ్‌ పక్కనే ఉండే 100 సర్వే నంబర్‌ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వారి మధ్య గొడవ జరగడంతో స్నేహితుడు చాందిని జైన్‌ను హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అమీన్‌పూర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ గడ్డం ప్రవీణ్‌ను అతడి స్నేహితులు శ్రీకాంత్‌ యాదవ్, శ్రీనివాస్‌ యాదవ్‌ పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం దీప్తిశ్రీనగర్‌ వద్దనున్న 101 సర్వే నంబర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారు. కవాడిగూడలో 10 నెలల క్రితం ఓ యువతిని నిర్మానుష్యంగా ఉన్న డీబీఆర్‌ మిల్లు పరిసరాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. డీబీఆర్‌ వెనక భాగంలో అర కిలోమీటర్‌ వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏం  జరిగినా ఎవరికీ తెలియని పరిస్థితి.   

సాక్షి, హైదరాబాద్‌ : కొద్దిగా చీకటయితే చాలు అసాంఘిక శక్తులు వళ్లు విరుచుకుంటున్నాయి. జనసంచారం తగ్గుముఖం పట్టగానే జంతువులై స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను అనుసరిస్తూ.. మంచిగా నటిస్తూ అవకాశం దొరకబుచ్చుకుని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కంటపడిన వాళ్లు ‘ఆడ’వాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేదు. పసికూనల నుంచి వయోధికుల వరకు ఈ మృగాలు వెంటబడి వేటాడుతున్నాయి. ఎంతోమంది యువతులు మృగాళ్ల పశువాంఛకు సమిధలవుతున్నారు. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. నాలుగువందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర గల హైదరాబాద్‌ మహానగరంలోనే. అంతర్జాతీయ నగరంగా విల్లసిల్లే రాజధాని నగరంలో అనేక ప్రాంతాలు ఆటవికుల అడ్డాలుగా మారాయి.

ఫ్లైఓవర్‌ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్‌ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడితేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఫిర్యాదు చేస్తే గంటకు తప్ప స్పందించని పోలీసు యంత్రాంగం అనేకానేక విషాదాంతాలకు మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో మృగాళ్లు పంజా విసురుతున్నారంటే.. అత్యాధునిక పోలీస్‌ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. నగరంలో విస్తరించిన అసాంఘిక శక్తుల అడ్డాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  

చదవండి : 28 నిమిషాల్లోనే చంపేశారు!

ప్రమాదకర కొన్ని ప్రదేశాలు
►  పంజాగుట్ట సమీపంలోని సాహెబ్‌నగర్‌లో వివాదాస్పదమైన హుడా లేఅవుట్‌లో అసాంఘిక పనులు నిత్యకృత్యం. అక్కడ మద్యం, వ్యభిచారం పరిపాటిగా మారింది.  
►  డివిజన్‌ మూసీ పరివాహిక ప్రాంతం కూడా అసాంఘిక శక్తులకు నెలవు.  
►  లింగోజిగూడలోని అధికారినగర్, కామేశ్వర్‌రావుకాలనీ, అమ్మవారి టెంపుల్‌ ఏరియా, సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం ప్రాంతం రాత్రి వేళల్లో అసాంఘిక పనులు
సాగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్నది లేదు. 
►  విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట చౌరస్తాలోని వీఎంహోమ్‌ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. రాత్రిళ్లు మందుబాబులు తప్పతాగి చిందులేస్తుంటారు. ప్రహరి కూలిపోవడంతో వెనుక నుంచి గ్రౌండ్‌లోని చెట్ల మధ్య కూర్చుని తాగుతూ పేకాడుతుంటారు.  
►  హెచ్‌ఎంటీ ప్రదేశం సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో హత్యలు, దోపిడీలు, ఆత్యాచార సంఘటనలు అనేకం జరిగాయి. ఒక వైపు జీడిమెట్ల, మరోవైపు జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇటు నుంచి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు సాహసించలేరు.  
►  కొంపల్లి కేటీఆర్‌ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు ప్రేమ పేరుతో తిష్ట వేస్తున్నారు. వీరిని అనుసరించే వచ్చే అల్లరిమూకలు మిగతా యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారిపోతుంది. ఇక తాగుబోతుల ఆగడాలు ఎన్నో చెప్పడం కష్టం. 
►  వెన్‌సాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ వెంచర్‌ ఖాళీగా ఉండడంతో రాత్రిళ్లు కొందరు మద్యం తాగి రెచ్చిపోతున్నారు. కార్టన్ల కొద్ది బీరు బాటిళ్లను తీసుకొచ్చి తాగాక వాటిని రోడ్ల మీదనే పగులగొడుతున్నారు. 


చర్లపల్లి, మధుసూదన్‌నగర్‌సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం

►  బస్‌ భవన్‌ వెనక సైతం గల్లీల్లో ప్రమాదకమైన పరిస్థితులే ఉన్నాయి. అడిక్‌మెట్‌ ప్లైఓవర్‌ బ్రిడ్జి కింద పట్టాలపై పోకిరీలు అర్ధరాత్రి వరకు తమ చీకటి కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు.  
►  రహమత్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు. ఇక్కడ మద్యం, గంజాయి తాగడం నిత్యకృత్యం. చుట్టూ చెట్లు, గుట్టలతో నిర్మానుష్యంగా ఉండడంతో వారికి అనువుగా మారింది.  
►  బ్రహ్మశంకర్‌ ఫేజ్‌–2 బస్తీకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేక మహిళలు రాత్రి వేళల్లో తమ నివాసాలకు వెళ్లలంటే భయపడుతున్నారు. చుట్టూ గుట్టలు నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ హంగామా సృష్టిస్తున్నారు.  
►  రామంతాపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో చీకటి పడగానే పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇక్కడి చిన్న చెరువు,  నెహ్రూనగర్‌ కమ్యూనిటీహాల్, రాజేంద్రనగర్‌ చౌరస్తా, చిన్న జెండా బస్తీ, బైపాస్‌ రోడ్డు, భగాయత్‌ మూసీ పరివాహక ప్రాంతాలు రాత్రి అవుతుండగానే పోకిరీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో వారిదే ఇష్టారాజ్యం. మద్యం తాగి పార్టీల పేరుతో చేసే హంగామాతో స్థానికులు అందోళన చెందుతున్నారు.  
►  రామంతాపూర్‌లోని కొన్ని బస్తీలలో బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రామంతాపూర్‌ ప్రధాన రహదారిలోని చర్చి స్కూల్‌ నుంచి దూరదర్శన్‌ కేంద్రం వరకు ఆరు వైన్‌ షాపులు, ఆరు బార్లు ఉండటంతో రోడ్ల మీదే మందు బాబులు చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతంలో సామాన్యులు నడిచి వెళ్లేందుకు భయపడుతుంటారు. ఇక్కడి పరిస్థితి పోలీసులకు తెలిసినా మౌనంగా ఉంటారు. 
►   ఎస్పీఆర్‌హిల్స్‌ రిజర్వాయర్‌ ఆవరణలోనూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు ఉండటంతో పేకాట, మద్యపానం సర్వసాధారణం.  

►  నాచారం బాబానగర్, దుర్గానగర్, ఎర్రకుంట చెరువు కట్ట, సీడీఎస్‌ బిల్డింగ్‌ వెనుకభాగం, దుర్గానగర్, బాబానగర్, పాతబడిన కెమికల్‌ కంపెనీలు తాగుబోతులకు, పోకిరీలకు అడ్డాలుగా ఉన్నాయి.
►   నాగర్జుననగర్, హెచ్‌బీకాలనీ లక్ష్మీనగర్‌ కాలనీవాసులకు ఇక్కడి వైన్స్‌ షాపులతో సమ్యలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. 
►  కూకట్‌పల్లిలోని బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే మహిళా కార్మికులపైనా వేధింపులు కానసాగుతున్నాయి. ఇక్కడ గతంలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు గొంతుకోసి చంపాడు.
►  గూడ్స్‌షెడ్‌ రోడ్డులో మద్యం తాగిన లారీ డ్రైవర్లు, హమాలీలు ఒంటరిగా వెళ్లే మహిళలను వేధించడం నిత్యకృత్యమైంది. 


ఆలయ ఆవరణలో మద్యం బాటిళ్లు.. 

►  అడవిని తలపించేలా ఉండే నిమ్మ్‌మే మైదానంలో నిత్యం మద్యం, గంజాయి సేవిస్తుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికనగర్‌ బస్టాప్‌ పక్కన ఉన్న నిమ్స్‌మే మైదానంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు  పరిపాటిగా మారాయి.  

►  కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, భాగ్యనగర్‌కాలనీ, నిజాంపేట ప్రాంతంలో రాత్రి 10 దాటాక వ్యభిచారులు రోడ్లపైకి రావటంతో ప్రతిరోజూ ఏదో ఒక దుర్ఘటన జరుగుతోంది.  
►  చంపాపేట పరిధిలోని డీఎంఆర్‌ఎల్‌ చౌరస్తా నుంచి 2  కి.మీ పొడవున గాయత్రినగర్‌ చౌరస్తా వరకు అర్ధరాత్రి 12 నుంచి వందలాది ఇసుక లారీలు అక్రమంగా పార్క్‌ చేస్తారు. వీటి డ్రైవర్లు ఇక్కడే మద్యం తాగుతూ చిదులేస్తుంటారు.  

► మల్లాపూర్, మల్లికార్జున్‌నగర్, జేఎన్‌యూఆర్‌ఎం కాలనీ, భవానీనగర్‌లో సాయంత్రం విద్యార్థులు ట్యూషన్‌ విడిచిపెట్టే సమయంలో కొంతమంది పోకిరీలు ద్విచక్ర వాహనాలపై వారిని భయపెడుతుంటారు. ఇక్కడి బెల్టుషాపుల కారణంగా తెల్లవారుజామున 5 గంటలకే మున్సిపల్‌ గ్రౌండ్‌ వద్ద తాగి తందానాలాడుతున్నారు.  

► చర్లపల్లి, మధుసూదన్‌నగర్, వెంకట్‌రెడ్డినగర్‌కాలనీల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం పోకిరీలకు అడ్డాగా మారింది. చీకటి పడగానే కాలనీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి రావడం, మద్యం, గంజాయి తాగడం.. కొందరు అమ్మాయిలతో కలిసి విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటి. ఈ క్రమంలో దారి వెంట వెళ్లేవారితో ఘర్షణ పడటం, సమీప కాలనీల్లో ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు.  ►  చిలుకానగర్‌ చౌరస్తా వైన్‌షాపుల వద్ద పోకిరీల ఆగడాలపై పోలీసులకు, ఎక్సైజ్‌ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. నాగోల్‌ నుంచి శిల్పారామం వెళ్లే రోడ్డుపై వ్యభిచారుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 


చీకటి పడితే నిర్మానుష్యమయ్యే యాకుత్‌పురా రైల్వే ట్రాక్‌ రోడ్డు   

►  మన్సూరాబాద్‌ డివిజన్‌ పెద్దచెరువు, చిన్న చెరువు ప్రాంతాల్లో చీకటి పడగానే మందు బాబులదే రాజ్యం. నాగోలు పరిధి బండ్లగూడ చెరువు ప్రాంతం అసాంఘిక కార్యకలపాలకు అడ్డా. హయత్‌నగర్‌ ఆటోనగర్‌లో ఇసుక లారీల అడ్డా వెనుక ఖాళీ ప్రదేశం కూడా అంతే. ఇక్కడ రాత్రిపూట లారీ డ్రైవర్లు, కూలీలు మద్యం తాగుతూ అసాంఘిక పనులకు
పాల్పడుతున్నారు. 

►  ఉప్పల్‌ బస్టాండ్‌ కమాన్‌ వద్ద ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వ్యభిచారులు విటులను ఆకర్షిస్తుంటారు. వీరి చర్యలకు స్కూల్‌ పిల్లలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.  
►  యాకుత్‌పురా రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్‌ రోడ్డు, తలాబ్‌కట్ట రైల్వే ట్రాక్‌ రోడ్డు, గౌలిపురా మేకలమండి రోడ్లు చీకటి పడగానే నేరగాళ్లకు స్థావరాలవుతున్నాయి. తలాబ్‌కట్ట, యాకుత్‌పురా రైల్వే ట్రాక్‌ రోడ్డులో తరచు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో చీకటి పడగానే ద్విచక్ర వాహనదారులు మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. వీధి దీపాలు సైతం సరిగా వెలగకపోవడంతో అసాంఘిక శక్తులకు చెలరేగుతున్నాయి. కొందరు మందుబాబులు ఈ ప్రాంతాల్లో తిష్టవేసి వెక్కిలి చేష్టలతో రాత్రి వేళల్లో స్థానికులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రాంతంలో సైతం రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా ఉటోంది. పోకిరీలు రైల్వే స్టేషన్‌ సమీపంలో తిష్టవేసి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.   

►  ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే రహదారి పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు భయపడతారు. పూర్తిగా చెట్లతో, నిర్మానుష్యంగా ఉన్న ఈ దారిలో ఇప్పటికే ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. దారి దోపిడీలు, దాడులు, హత్యలు జరిగాయి. ఈ రూట్‌లో రాత్రి పూట పోలీస్‌ గస్తీ పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు.  


అసాంఘిక శక్తులకు అడ్డా ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌ రహదారి

►  జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయ సమీపంలో తాగుబోతుల ఆగడాలు అరికట్టేవారు లేదు. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోవడానికి గద్దెలు, ఎవరూ రారన్న ధీమాతో మందుబాబులు ఇక్కడే తాగి గొడవలు పడుతుంటారు. ఈ రోడ్డు గుండానే మహిళ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు.  

పోలీస్‌ ఫెయిల్‌!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ పోలీసు వ్యవస్థ తీరుపై విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. నేర నివారణ అంశాన్ని పక్కనబెట్టి నేర పరిశోధనకే ప్రాధాన్యత ఇస్తుండటంపై విమర్శలకు దారి తీసింది. శంషాబాద్‌ సమీపంలో డాక్టర్‌ ప్రియాంకారెడ్డి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు తమ పరిధి కాదని తిప్పిపంపడం, వేగంగా కార్యాచరణలో దిగడంలో విఫలమయ్యారని మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.  

పోలీసుల బాధ్యత లేకనే..  
డాక్టర్‌ ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురవడం పోలీస్‌ వ్యవస్థ విఫలమవ్వడంగానే భావించాలి. బంధువులు ఫిర్యాదు చేసిన వెంటనే సరైన రీతిలో స్పందించి ఉంటే కనీసం ప్రియాంక ప్రాణాలతోనైనా దొరికేది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన లేదని చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.
– డాక్టర్‌ శ్వేతాశెట్టి, నేషనల్‌ విమెన్స్‌ పార్టీ ప్రెసిడెంట్‌ 

మద్యం వల్లే నేరాలు..  
స్మార్ట్‌ ఫోన్లలో క్లిక్‌ దూరంలో ఉండే అశ్లీల వెబ్‌సైట్లు, ఎక్కడపడితే అక్కడ లభించే మద్యంతో సమాజంలో నేరాలను పెంచతున్నాయి.  ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండాలి. అదేవిధంగా మహిళలు సైతం తమ చుట్టూ ఉండే మప్పు నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి.
– అనూప్రసాద్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ 

అప్రమత్తంగా ఉండాలి  
ఓ తల్లిగా చెప్పుతున్నా.. నాక్కూడా ఓ కూతురు ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఆడ పిల్లలకు మాత్రం రక్షణ దొరకడం లేదు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి తర్వాత కూడా బయట తిరుగుతున్నారు. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ లేట్‌నైట్‌లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లడం చాలా ప్రమాదం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అత్యవసర ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలి.
– డాక్టర్‌ చిరంజీవి, ఆర్థోపెడిక్‌ సర్జన్, సన్‌షైన్‌ ఆస్పత్రి 

ఫిర్యాదులకు ఒకే నెంబర్‌ ఉండాలి  
తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే చెప్పించడం కాదు.. చదువుతో పాటు కొంత సంస్కారం కూడా నేర్పించాలి. మానవ సంబంధాలు, సమాజంపై అవగాహన కల్పించాలి. ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే దొరికి పోతామనే భయం కల్పించినప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి. అంతే కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తమ రక్షణ కోసం ఏ ఫోన్‌ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలో కూడా చాలా మంది మహిళలకు తెలియదు. ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్‌ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేస్తున్నారు. ఆ సమయంలో వారు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. అన్ని రకాల ఫిర్యాదులకు ఒకే నెంబర్‌ కేటాయించి, ఆ నెంబర్‌పై పనితీరుపై  పిల్లలకు అవగాహన పెంచితే రక్షణ సులువవుతుంది.
– డాక్టర్‌ మంజుల అనగాని, గైనకాలజిస్ట్‌ 

చదవండి :  శంషాబాద్‌లో మరో ఘోరం

అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్‌

ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే

మరో ఘోరం : కిడ్నాప్‌, గ్యాంగ్‌రేప్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement