
న్యూఢిల్లీ: అర డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉండి.. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఓ గ్యాంగ్‌స్టర్‌ని బర్త్ డే వీడియో పట్టించింది. ఆ వివరాలు.. ప్రతీక్ ఛబ్రా అనే వ్యక్తి చిన్న చిన్న నేరాలకు పాల్పడుతూ.. గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. అతడిపై అత్యాచారం, గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో 2012లో ఓ బిల్డర్‌ను రూ. లక్ష ఇవ్వాల్సిందిగా బెదిరింపులకు గురి చేశాడు ఛబ్రా. కానీ ఆ బిల్డర్ డబ్బు చెల్లించడానికి ఒప్పకోకపోవడంతో ఛబ్రా తన గ్యాంగ్‌తో కలిసి రోడ్డు మీదే అతడిపై దాడి చేశాడు. దాంతో సదరు బిల్డర్, ఛబ్రా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదే కాక ఛబ్రా మీద మరి కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. గత రెండుమూడేళ్లుగా ఢిల్లీ పోలీసులు ఛబ్రా కోసం గాలిస్తున్నారు. కానీ ఫలితం లేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఛబ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో అతడిని పట్టించింది. వారం రోజుల క్రితం ఛబ్రా తన అనుచరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. అందులో భాగంగా తుపాకీతో కేక్ కట్ చేసి.. హల్‌చల్ చేశాడు. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో పోలీసులు ఛబ్రా గురించి, అతడి గ్యాంగ్‌లో ఉండే సభ్యులకు సంబంధించిన క్లూస్‌ను ఈ వీడియో ఆధారంగా సంపాదించారు. దాని ప్రకారం అతడిని పట్టుకునేందుకు వల పన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పోలీసులు ఛబ్రాతో పాటు నిఖిల్ చౌహాన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.