
సాక్షి, కైకలూరు: మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ సత్ఫలితాలను ఇస్తోంది. కృష్ణా జిల్లాలో ‘దిశ యాప్’ ద్వారా ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఓ మహిళను కాపాడారు. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు మహిళలు సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో ఘటనలో మహిళకు మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన ఆటోడ్రైవర్ బారి నుంచి ఆ మహిళ సేఫ్‌గా బయటపడింది. (దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..)
ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామానికి చెందిన మహిళకు ఆటోడ్రైవర్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన సదరు మహిళ ‘దిశ యాప్’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే 8 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు ఆ మహిళను కాపాడారు. పరారీ అయిన ఆటోడ్రైవర్‌ను రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా రక్షణ కోసం యాప్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బందిని ఎస్పీ రవీంద్రబాబు అభినందించారు.