(ఫైల్ ఫోటో) ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్
న్యూఢిల్లీ: తన చావుకు ఎమ్మెల్యే కారణమంటూ ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన శనివారం దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. అతని సూసైడ్ నోట్ మేరకు పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని దుర్గావిహార్‌లో నివసించే రాజేంద్ర సింగ్ అటు వైద్యుడిగా పనిచేస్తూనే, ఇటు వాటర్ ట్యాంకర్ల వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీ జల బోర్డులో తన వాటర్ ట్యాంకర్లు అద్దెకు ఇచ్చాడు. అయితే ఈ కాంట్రాక్టు కొనసాగాలంటే డబ్బులు ముట్టజెప్పాలంటూ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ డబ్బులు డిమాండ్ చేశాడు. దానికి రాజేంద్ర సింగ్ నిరాకరించగా.. అతని నీటిట్యాంకర్లను జల బోర్డు నుంచి తొలగించి వేధింపులకు పాల్పడ్డారు. (మహమ్మారి విజృంభించవచ్చు!)
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్థాపం చెందిన ఆయన శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరుడు కనపిల్ నాగర్ కూడా వేధింపులకు పాల్పడ్డాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో ఓ మహిళను వేధించినందుకుగానూ 2018లో ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌పై కేసు నమోదైంది. (మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment