నిందితులను చూపుతున్న సీఐ వీరస్వామి తదితరులు
సాక్షి, జడ్చర్ల: రహదారులపై వెళ్తున్న ద్విచక్రవాహనాలను లిఫ్టు అడిగి కొంతదూరం వెళ్లాక ఆపి చోరీకి పాల్పడే దారి దోపిడీ దొంగల ముఠాను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అఖిల్ కృష్ణ, అంకం భాస్కర్, పాస్టం కల్యాణ్, రాపల్లె చంద్రుడు, వడిత్యావత్ శివ, శివగళ్ల రాజ్‌కుమార్, నాయిడు దుర్గరాజ్‌కుమార్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఆటోలో ప్రయాణిస్తూ దారిపై ఒంటరిగా వస్తున్న మోటార్‌బైక్‌లను ఆపుతారు. బైక్ ఆపితే వారిలో ఒకరు దానిపై ఎక్కి కొద్ది దూరం వెళ్లాక బైక్‌ను ఆపడం ఆ వెంటనే వెనకగా ఆటోలో వచ్చిన మిగతా దొంగలు అందరూ కలిసి లిఫ్టు ఇచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న బైక్, నగదు, మొబైల్ ఫోన్ తదితర సొత్తును దోచుకుని పరారవుతారు. ఈ క్రమంలో ఈ నెల 10న బూర్గుపల్లికి చెందిన కుమ్మరి రాములు బైక్‌పై వస్తుండగా లిఫ్టు అడిగి నాగసాల గ్రామ శివారులో ఆపి అతని దగ్గర రూ.1,800 నగదు, సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యారు. ఈ విషయమై బాధితుడు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెళ్లడించారు.
ఈ క్రమంలో మంగళవారం వాహనాలను స్థానిక నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడిందన్నారు. అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలో కూడా ఇదే విధంగా లిఫ్టు ఆపడం, కొద్ది దూరం వెళ్లాక బైక్ ఆపడం వెనువెంటనే వెనుకగా ఆటోలో వచ్చి బెదిరించి బైక్, సొమ్ము తదితర సొత్తును దోచుకెళ్లినట్లు చెప్పారు. నిందితుల నుంచి మూడు బైక్‌లు, ఆటో, మొబైల్ ఫోన్, రూ.1,200 నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం జడ్చర్లకు వచ్చి టిఫిన్ సెంటర్ తదితర ఉపాధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. వీరికి బాదేపల్లికి చెందిన యువకులు కూడా సహకరించి చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుళ్లు మహేందర్, మహమూద్, కానిస్టేబుళ్లు బేగ్, శంకర్, రఘునాథ్‌రెడ్డి, బాబియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment