సాక్షి, చెన్నై: కుటుంబంలో తండ్రితోపాటు కొడుకు, కూతురు అందరూ దొంగతనానే వృత్తిగా ఎంచుకున్నారు. తూత్తుకుడిలో ఆలయ కుంభాభిషేకం సందర్భంగా నగల దోపిడీకి పాల్పడిన కుటుంబసభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నై నీలాంగరై ఈచ్చంబాక్కం బెత్తేల్ నగరానికి చెందిన సుబ్రమణి(65), అతని కుమారుడు(25), కుమార్తె(29) చోరీలనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.
రద్దీని ఆసరాగా చేసుకుని చోరీ: రెండు రోజుల క్రితం తూత్తుకుడి శంకరరామేశ్వరాలయంలో జరిగిన కుంభాభిషేకంలో సందట్లో సడేమియాల్లా వీరు చేతివాటం చూపారు. రద్దీని ఆసరాగా చేసుకుని భక్తుల వద్ద ఉన్న నగలను కొట్టేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 16 కేసులు నమోదు చేశారు. మొత్తం 67 సవర్ల నగలను దొంగలు ఎత్తుకుపోయారని తేల్చారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా: దీనిపై పోలీసులు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రత్యేక పోలీసులు దర్యాప్తు చేపట్టి నిఘా పెట్టి, ముగ్గురినీ బుధవారం అరెస్టు చేశారు. ఒక కారుతోపాటు వారి వద్ద ఉన్న 52 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. తూత్తకుడి జిల్లాలో గత రెండు నెలల్లోనే వీరినై 61 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment