సాక్షి, హైదరాబాద్: మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసు మరువకముందే మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం సృష్టించింది. తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బోరబండకు చెందిన మాధవి, ఎర్రగడ్డకు చెందిన సందీప్‌లు నాలుగు రోజుల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కోపం పెంచుకున్న తండ్రి మనోహర చారి, సెటిల్‌మెంట్ కోసమని పిలిచి వారిపై దాడికి పాల్పడ్డాడు.
బైక్‌పై వచ్చి మనోహర చారి బ్యాగులో తనతో తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేశాడు. ముందుగా సందీప్‌పై దాడి చేశాడు. మాధవి అడ్డుకోవడంతో ఆమెను విచక్షణారహితంగా నరికాడు. కత్తి వేటుకు సంఘటనా స్థలంలోనే ఆమె చేయి తెగిపడిపోయింది. ఆమె దడవ చీలిపోయింది. స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా మనోహరచారి బెదిరించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రేమజంటను సనత్‌నగర్‌లోని నీలిమ ఆసుపత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసి యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు.
గత ఐదేళ్లుగా ప్రేమించికుంటున్న సందీప్, మాధవి ఈ నెల 12న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. మేనమామతో మాధవికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మాధవి పారిపోయి పెళ్లిచేసుకుంది. ఈ నేపథ్యంలో దాడి జరగడం సంచలనం రేపింది. షెడ్యూల్డ్ కులానికి చెందిన సందీప్‌ను కూతురు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవ జంటను పిలిచి దారుణాతి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. బట్టలు పెడతామని పిలిచి యువ జంటపై కత్తితో దాడికి దిగాడు.
పోలీసుల అదుపులో నిందితుడు?
మాధవి తండ్రి మనోహర చారి పోలీసులకు లొంగిపోయాడు. అతడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.
మాధవి పరిస్థితి విషమం: వైద్యులు
‘మాధవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెడపై బలంగా కత్తితో దాడి చేయడంతో మెదడుకు దారి తీసే నరాలు దెబ్బతిన్నాయి. ఎడమ చెయ్యిపై కత్తితో దాడి చేయడంతో సగభాగం కట్ అయి తీవ్రంగా రక్త స్రావం అయింది. ప్రసుతం మూడు గంటల పాటు వైద్యం అందించాల్సి ఉంటుంది. ఎనిమిది గంటలు గడిస్తేగాని ఏమి చెప్పలేమ’ని యశోద ఆస్పత్రి వైద్యులు దేవేందర్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment