వీడియోలోని దృశ్యాల ఆధారంగా చిత్రం
వాషింగ్టన్: జాగ్రత్తగా ఉండాల్సిన అధికారి నిర్లక్ష్యంగా వహించాడు. బిత్తిరి చర్యతో నైట్ క్లబ్‌లో ప్రజలను బెంబేలెత్తించాడు. అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి మాత్రం గాయపడ్డాడు. డెన్వర్ నగరం(కొలరెడా)లోని ఓ నైట్ క్లబ్‌లో జరిగిన ఘటన తాలుకూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎఫ్‌బీఐ అధికారి(ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు) ఒకరు శుక్రవారం రాత్రి డెన్వర్‌లోని మైల్ హైల్ స్పిరిట్ అనే నైట్ క్లబ్‌కు వెళ్లాడు. హుషారుగా ఫ్లోర్‌పై బ్రేక్ డాన్స్ చేయటం ప్రారంభించాడు. చుట్టూ అమ్మాయిలు, అబ్బాయిలు చేరి వావ్ అనుకుంటుంటే.. ఆ కోలాహలం చూసి తట్టుకోలేక తన ట్యాలెంట్ ప్రదర్శించాడు. బ్యాక్‌ఫ్లిప్ మూమెంట్‌తో అదరగొట్టాడు. ఆ ప్రయత్నంలో అతని వెనకభాగంలో దాచుకున్న గన్ ఎగిరి కింద పడిపోయింది. కంగారులో దాన్ని తీసుకునే క్రమంలో అది కాస్త పేలింది. బార్‌లో పని చేసే ఓ ఉద్యోగి కాలికి తగిలి గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ బుల్లెట్ కింది దిశగా ప్రయాణించటంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటన తర్వాత సారీ చెబుతూ అక్కడి నుంచి అతను గాయబ్ అయిపోయాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి వైరల్ చేశాడు.
ఎఫ్‌బీఐ మౌనం... ఘటన అనంతరం రంగంలోకి దిగిన డెన్వర్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే ఎఫ్‌బీఐ అధికారి కావటంతో కేసు మాత్రం నమోదు చేయలేదు. మరోవైపు ఎఫ్‌బీఐ ఈ కేసును గోప్యంగా డీల్ చేయాలని చూస్తోంది. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడా? లేదా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై మీడియాకు ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఎఫ్‌బీఐ అధికారులు సుమఖంగా లేకపోవటం విశేషం. అయితే డెన్వర్ పోలీసులు మాత్రం ఎఫ్‌బీఐతో ప్రమేయం లేకుండా ఈ కేసులో ముందుకు వెళ్తామని చెబుతున్నారు. ఇప్పటికే డిస్ట్రిక్ అటార్నీ కార్యాలయానికి నివేదిక ను సమర్పించగా, వారిచ్చే ఆదేశాలనుసారం ముందుకు వెళ్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment