
సాక్షి, విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఓ భర్త గృహహింస చట్టం కింద కోర్టును ఆశ్రయించాడు. తన భార్య తనను చిత్ర హింసలు పెడుతుందంటూ రామ్‌కుమార్ అనే వ్యక్తి విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివాహం జరిగి రెండు నెలలకే తన భార్య వేధింపులకు పాల్పడుతోందని విజయవాడ కంచికామకోటి నగర్కు చెందిన గోగు రామ్ కుమార్ అనే వ్యక్తి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విజయవాడ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటీషన్ను స్వీకరించడంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
అప్పటికే వివాహమైన సదరు మహిళ .. ఆ సంగతి దాచి తనను మరో వివాహం చేసుకుందని పేర్కొన్నాడు. పెళ్లైన రెండు నెలల నుంచి తనను మానసికంగా, శారీరకంగా ఆమె హింసిస్తోందని రామ్‌కుమార్ ఆరోపిస్తున్నాడు. కాగా, రాష్ట్రంలో ఈ తరహా తొలి కేసు ఇదే కావటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.