రిలయన్స్‌ జియో టవర్ల పేరుతో టోకరా! | Fraud With Reliance Jio Towers in Hyderabad | Sakshi
Sakshi News home page

టవర్ల పేరుతో టోకరా!

Published Tue, Feb 12 2019 9:32 AM | Last Updated on Tue, Feb 12 2019 9:32 AM

Fraud With Reliance Jio Towers in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌ ద్వారా ఎరవేసి అందినకాడికి దండుకునే సైబర్‌ నేరగాళ్లు ‘సీజనల్‌ ఫ్రాడ్స్‌’ మొదలెట్టారు. రిలయన్స్‌కు చెందిన జియో సంస్థ ఇటీవల కాలంలో తమ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం అనేక ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేస్తోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న సైబర్‌ నేరగాళ్లు సదరు సంస్థకు చెందిన నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించారు.  దీని ఆధారంగా నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి మోసం చేశారు. దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్‌ పరిధిలోని భోలక్‌పూర్, మేకలబండకు చెందిన ఓ వ్యాపారి ఇంటిపై కొంత స్థలం ఖాళీగా ఉంది. దీనిని ఏదైనా సర్వీస్‌ ప్రొవైడర్‌కు టవర్‌ ఏర్పాటు చేసుకోవడానికి అద్దెకు ఇస్తే అదనపు ఆదాయం వస్తుందని అతను భావించాడు. దీంతో టవర్లు ఏర్పాటు చేసుకునే సంస్థల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో అతడికి (towersjio.in) అనే వెబ్‌ చిరునామా లభించింది. ఆ లింకును ఓపెన్‌ చేసి చూసిన అతను దానికి ఆకర్షితుడయ్యాడు. తాము రిలయన్స్‌ జియో సంస్థకు టవర్లు ఏర్పాటు చేస్తుంటామంటూ అందులో ప్రచారం చేసుకున్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో 500 చదరపు అడుగుల స్థలానికి నెలకు రూ.35 వేలు అద్దె ఇస్తామని, అడ్వాన్స్‌గా రూ.15 లక్షలు చెల్లిస్తామని ఆ సైట్‌లో ఉంది. కనీసం 15 ఏళ్ల కాలానికి అగ్రిమెంట్‌ చేయాలని, ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.25,250, అగ్రిమెంట్‌ ఫీజుగా రూ.69,500 చెల్లించాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆసక్తి చూపిన సదరు వ్యాపారి వెబ్‌ పేజ్‌ ఆఖరులో ఉన్న కాలమ్స్‌లో తన పూర్తి వివరాలు పొందుపరిచాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్‌ జియో సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ కొందరు ఫోన్‌లో సంప్రదించారు. భవనం, సైట్‌కు  సంబంధించిన పూర్తి పత్రాలు, నిరభ్యంతర పత్రం పంపాల్సిందిగా కోరారు.

దీంతో అతను వాటిని స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో వారు చెప్పిన ఈ–మెయిల్‌ చిరునామాలకు పంపాడు. ఆపై మరోసారి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు టవర్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు. అయితే దానికి ముందు కొంత ప్రాసెస్‌ ఉంటుందని చెప్పారు. రిజిస్ట్రేషన్, టీడీఎస్, జీఎస్టీ... తదితరాల నిమిత్తం రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. దీనికి వ్యాపారి అంగీకరించడంతో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లు ఇచ్చి వాటిలో నగదు డిపాజిట్‌ చేయాలని సూచించారు. తొమ్మిది విడతల్లో రూ.8 లక్షలు కాజేశారు. ఆపై వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమికంగా దుండగులు వాడిన ఫోన్‌ నంబర్లు, నగదు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి బోగస్‌ వెబ్‌సైట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌ను మాత్రమే నమ్మి డబ్బు డిపాజిట్‌ చేయవద్దని కనీసం ఒకసారైనా వ్యక్తిగతంగా కలిసి నిర్ధారణ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement