
నేలమట్టమైన ఇల్లు
లక్నో/కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన నేరగాడు వికాస్ దుబే గ్యాంగ్ ఎనిమిదిమంది పోలీసులను పొట్టన బెట్టుకున్న ఘటనకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దుబే స్వగ్రామం భిక్రూలోని అతడి సొంతింటిని సాయుధ పోలీసులు బుల్‌డోజర్లతో నేలమట్టం చేయించారు. ఆవరణలోని ఖరీదైన కార్లను ధ్వంసం చేయించారు. నేరగాడు దుబేకు సహకరించినట్లు ఆరోపణలు రావడంతో చౌబేపూర్ పోలీస్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)ను అధికారులు సస్పెండ్ చేశారు. కాల్పులు జరిగినప్పటి నుంచి జాడ తెలియకుండాపోయిన దుబే కోసం 25 పోలీసు బృందాలు యూపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దుబే లొంగిపోకుంటే, పోలీసులు అతడిని కాల్చి చంపాలని అతడి తల్లి సరళా దేవి అన్నారు. ‘అతడి కారణంగా మేం సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.