
సాక్షి, హైదరాబాద్ : పెద్దమనిషి ముసుగులో చెలామణి అవుతున్న గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడు అని లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతి ఆరోపించింది. లైంగిక వేధింపుల విషయాన్ని గజల్ శ్రీనివాస్ భార్య దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ..‘ వేధింపులపై గజల్ శ్రీనివాస్ కుటుంబసభ్యులు స్పందించలేదు. గత రెండు నెలలుగా వేధింపులు ఎక్కువ అయ్యాయి. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆయన వద్ద పనిచేసే చేసే పార్వతి మంచిది కాదు. ఆమె నన్ను ప్రలోభపెట్టేందుకు చాలా ప్రయత్నించింది. సార్ మాట వింటే మంచి లైఫ్ ఉంటుందని చెప్పుకొచ్చేది.
నేను ఒక్కదాన్నే కాదు...ఆఫీస్‌లో చాలామంది వేధింపులకు గురయ్యారు. అంతేకాకుండా గజల్ శ్రీనివాస్ చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడు. త్వరలో నేను గవర్నర్ అవుతా. నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తా. ఒకవేళ నా మాట వినకపోతే నీకు బయట ఎక్కడా జాబ్ దొరకకుండా చేస్తా అని బెదిరించేవాడు. చాలామంది అమ్మాయిలందరినీ అదే విధంగా బెదిరించేవాడు. గదిలోకి పిలిచి లైంగికంగా వేధించేవాడు. అయితే నాకులా మరో యువతి బాధపడకూడదనే ఉద్దేశ్యంతో ధైర్యంగా ముందుకు వచ్చాను. పోలీసులు కూడా నా ఫిర్యాదుకు స్పందించారు. అందుకే పక్కా సాక్ష్యాలను పోలీసులు అందించా. గజల్ శ్రీనివాస్‌కు జీవితాంతం జైల్లోనే ఉండాలి. అతడికి జైలు శిక్ష కూడా సరిపోదు. అలాంటి వాడిని తేలికగా వదలకూడదు. కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేసింది.
వెలుగు చూస్తున్న ‘గజల్’ అకృత్యాలు
గజల్ శ్రీనివాస్ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మసాజ్ పేరుతో తన వద్ద పనిచేసే యువతులను వేధింపులకు గురి చేయడమే కాకుండా, తన మాట వినకపోతే సిబ్బందితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడని తెలుస్తోంది. యువతులతో మసాజ్ చేయించుకున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆ వీడియోల్లో గజల్ శ్రీనివాస్...అమ్మాయిలతో కలిసి ఉన్న దృశ్యాలు ఉండగా, గత కొన్నేళ్లుగా చాలామంది సిబ్బందితో అతడు ఇదే తరహాలో జల్సాలు చేస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా తనవద్ద పనిచేసే యువతుల పేదరికాన్ని ఆసరా చేసుకుని గజల్ శ్రీనివాస్ ఈ అకృత్యాలకు పాల్పడుతుండేవాడని, అతడికి పనిమనిషి పార్వతి సహకరించేదని తెలుస్తోంది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు. వేధింపుల కేసులో అరెస్ట్ అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ..ఆమెను తన బిడ్డలా చూసుకున్నానని, ఎప్పుడూ అసభ్యంగా తాను ప్రవర్తించలేదని అన్నారు. అసలు ఆమె పట్ల తనకెలాంటి చెడు అభిప్రాయం లేదని గజల్ శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment