
సాక్షి, హైదరాబాద్: యువతిపై వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్‌కు విధించిన జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈనెల 25 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తనకు బెయిల్ ఇవ్వాలని మరోసారి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈనెల 18న కోర్టు విచారణ జరపనుంది.
అంతకుముందు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో మరోసారి అర్జీ పెట్టుకున్నారు. ‘సేవ్ టెంపుల్స్’ సంస్థలో పనిచేస్తున్న సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ నెల 2న గజల్ శ్రీనివాస్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్
కాగా, ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న ‘సేవ్ టెంపుల్స్’ ఉద్యోగిని పార్వతి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గజల్ శ్రీనివాస్ అరెస్టైనప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. గజల్ శ్రీనివాస్ వేధింపులకు సహకరించారని, చెప్పినట్లుగా వినాలని బాధితురాలిపై ఆమె ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment