యువకుడిపై యువతి యాసిడ్ దాడి | Girl Attacked Boy With Acid After He Refuses To Marry Her In UP | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడని...

Published Sat, Oct 26 2019 12:54 PM | Last Updated on Sat, Oct 26 2019 1:46 PM

Girl Attacked Boy With Acid After He Refuses To Marry Her In UP - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను మోసం చేశాడనే కోపంతో ఓ అమ్మాయి యువకుడిపై యాసిడ్‌తో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో గాయపడ్డ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... జీవన్‌ఘడ్‌కు చెందిన ఫైజద్‌ అనే 20 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో నెల రోజులుగా ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి ఎందుకిలా చేస్తున్నావని అతడిని నిలదీసింది. ఇన్నాళ్లు తనతో సన్నిహితంగా ఉండి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకంటూ గొడవపడింది. 

ఈ క్రమంలో ఫైజద్‌ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతడి ముఖంపై పోసింది. ఈ ఘటనలో ఫైజద్‌ తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. కాగా యాసిడ్‌ దాడికి పాల్పడినందుకు సదరు యువతిని ఐపీసీ సెక్షన్‌ 326ఏ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక బాధితుడి తల్లి మాట్లాడుతూ... తన కొడుకుకు సదరు అమ్మాయితో సంబంధం ఉందని.. అయితే వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదని తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఫైజద్‌ను వేధించగా అతడు తిరస్కరించాడని.. అందుకే దాడి చేసి ఉండవచ్చని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement