నరేష్ ఇంటి ఎదుట బైఠాయించిన సుజాత, బంధువులు
నస్పూర్(మంచిర్యాల): తనను ప్రేమించి, కొతకాలంగా సహజీవనం గడిపిన ప్రియుడు మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్లంపల్లికి చెందిన గంపల సుజాత అనే యువతి గురువారం నస్పూర్‌లోని మోతునూరి నరేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. సుజాత, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని ఒక స్కానింగ్ సెంటర్‌లో ఆరు సంవత్సరాలుగా ఇరువురు పనిచేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రస్తుతం నరేష్ వేరొక ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సుజాత ప్రతిరోజు బెల్లంపల్లి నుంచి రాకపోకలు సాగించడంతో నరేష్ ఆమెను మంచిర్యాలలో ఒక అద్దె ఇంటిలో ఉంచి సంవత్సర కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారు. సుజాత చిట్టీ వేస్తూ పొదుపు చేసుకున్న రూ.1.80 లక్షలు తన ఖర్చులకోసం వాడుకున్నాడు.
ఇటీవల నరేష్ తల్లిదండ్రులు అతనికి వేరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని నిలదీసింది. దీనికి అతడు నిరాకరించాడు. దీంతో నరేష్‌పై మంచిర్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నరేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. సీసీసీ ఎస్సై రాజేంద్రప్రసాద్ సుజాతతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు న్యాయం జరిగేంత వరకు దీక్ష కొనసాగిస్తానని సుజాత పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment