గాంధీనగర్ : మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వాస్తవానికి ఇటీవల మహిళలపై దాడులు మరింత పెరుగుతున్నాయి. తాజాగా గుజరాత్‌లో మరో దారుణం వెలుగు చూసింది. 19 ఏళ్ల దళిత యువతిని అత్యాచారం చేసి, హత్య చేసి.. చెట్టుకు వేలాడదీశారు. యువతి మృతదేహాన్ని మంగళవారం అహ్మదాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ ఆసుపత్రి ముందు బైఠాయించి నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవడంతోపాటు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో # Justice For Kajal అనే ట్యాగ్‌తో న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు.
ఈ నెల 1న సోదరితో కలిసి బయటికి వెళ్లిన ఓ యువతిని(19) కొందరు దుండగులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. తన కూతురిని ఎవరో అపహరించారని యువతి తండ్రి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమల్ భర్వాద్ అనే వ్యక్తి తన సోదరిని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడని బాధితురాలి సోదరి ఆరోపించింది. కానీ దీనిపై పోలీసులు సరిగా స్పందించలేదని, తమ కేసును స్వీకరించలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా జనవరి 5న మొడాసలోని సైరా గ్రామంలో మర్రిచెట్టుకు వేలాడదీసిన యువతి మృతదేహం లభ్యమైంది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించంగా భీమల్ ప్రయాణించిన కారు తన తండ్రి పేరిట నమోదు అయినట్లు వెల్లడైంది. భీమల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిని కిడ్నాప్ చేసినట్లు, అనంతరం అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అయితే ఇప్పటి వరకు నిందితులను పోలీసులు పట్టుకోకపోవండంతో గుజరాత్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను పట్టుకొని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని కుటుంబ సభ్యులు తెగేసి చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని గుజరాత్ ఎస్సీ, ఎస్టీ సెల్‌కు చెందిన అదనపు డీజీపీ కెకె ఓజా హామీయిచ్చారు. కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి, నిందితులను అరెస్టు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment