
గుంటూరు నగరానికి చెందిన దంపతులు తమ కుమార్తె సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మధిర రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరి గింది. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన బుంగా వెంకయ్య(47), ఆయన భార్య రజిని(40), కుమార్తె సాయి కృష్ణవేణి(19) ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. కుమార్తె వివాహం విషయంలో కొద్ది రోజులుగా వివాదం జరగడమే ఇందుకు కారణమని సమాచారం. వెంకయ్య జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా మృతుల వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు.
మధిర(ఖమ్మం): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి మధిర రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన బుంగా వెంకయ్య(47), గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులుగా కుమార్తె వివాహం విషయంలో వీరి ఇంట్లో వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెంకయ్య, ఆయన భార్య రజని(40), కుమార్తె సాయి కృష్ణవేణి(19) కలిసి గుంటూరు నుంచి రైలులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మధిరకు చేరుకున్నారు. మధిర రైల్వేస్టేషన్ సమీపంలో విజయవాడ వైపు వెళ్లే డౌన్‌లైన్ గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వెంకయ్య కుమారుడు సాయిగోపినాథ్, గుంటూరులో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. వెంకయ్య జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా వారిని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి బంధువులకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి సమాచారమిచ్చారు.