మహిపాల్ సింగ్ పెళ్లినాటి ఫొటో(కర్టెసీ : న్యూస్18.కామ్)
కన్నతండ్రి కాదు పొమ్మన్నాడు.. కట్టుకున్న భార్య కష్టసుఖాలను పంచుకోలేకపోయింది... మనఃశ్శాంతి కోసమని మతం మారితే పాపం చేశావంటూ బంధువులు దూషించారు.. వీటన్నిటికీ తోడు పనిచేసే చోట గౌరవంగా బతకలేకపోతున్నానే ఆవేదన.. ఈ కారణాల వల్లేనేమో సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్ హంతకుడిగా మారాడు అంటున్నారు అతడి గురించి తెలిసిన వ్యక్తులు. అయితే నిజం నిగ్గుతేలాలంటే సిట్‌తో దర్యాప్తు చేపట్టాల్సిందేనని నిశ్చయించింది ప్రభుత్వం.
హరియాణాలోని గురుగ్రామ్‌లో జడ్జి కృష్ణకాంత్ గార్గ్ భార్య, కొడుకుపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపిన ఘటన శనివారం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన జడ్జి భార్య రీతూ మరణించగా, అతని కుమారుడు ధ్రువ్ బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ దారుణానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు మహిపాల్ సింగ్‌ను అదుపులోకి పోలీసులు.. హత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. మహిపాల్ సింగ్ గతం, ప్రస్తుత జీవితం గురించి ఓ జాతీయ మీడియా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
చిన్ననాడే తండ్రికి దూరమయ్యాడు..
‘మహిపాల్ తల్లి పెళ్లైన నాటి నుంచే చిత్రహింసలకు గురైంది. తాగుబోతు అయిన భర్త చేసే అకృత్యాలన్నీ పంటి బిగువనే భరించేది. అసహ్య పదజాలంతో తనని దూషించినా సహించేది. అతడు కొట్టిన దెబ్బల కారణంగా రెండుసార్లు గర్భస్రావం జరిగి ప్రాణాపాయ స్థితిలో పడింది. కానీ మరోసారి అలా జరగకూడదనే మహిపాల్ కడుపులో పడగానే మా ఇంటికి వచ్చేసింది. రెండు నెలల పసికందుగా ఉన్ననాటి నుంచీ వాడి బాగోగులు నేనే చూస్తున్నా. తండ్రి గురించి తెలియకుండా పెంచుదామనుకున్నా. కానీ అది సాధ్యమయ్యే పనికాదు కదా. అందుకే ఏడాదికోసారి అతడి తండ్రి, బంధువుల దగ్గరికి తీసుకెళ్లేవాడిని’ అంటూ మహిపాల్ గతం గురించి చెప్పుకొచ్చారు అతడి మేనమామ. ‘తల్లి అనుభవించిన వేదనను తలచుకుంటూ.. తండ్రికి దూరమయ్యాననే బాధ మహిపాల్‌లో అంతర్లీనంగా దాగుండేది. కానీ ఆ విషయం బయటపడనిచ్చేవాడు కాదు’ అని మహిపాల్ బాల్యం గురించి ఆయన వివరించారు.
పెళ్లితో కొత్త జీవితం మొదలు పెడదామనుకుంటే..!
2007లో హర్యానా పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన మహిపాల్.. ఆ మరుసటి ఏడాదే వికాస్ దేవీ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లైన రెండో రోజే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే బంధువుల బలవంతం మీద మళ్లీ మహిపాల్ దగ్గరికి వచ్చింది. భార్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన మహిపాల్ గురుగ్రామ్‌కి మకాం మార్చాడు. అయితే కొద్ది రోజులపాటు సజావుగా సాగిన సంసారంలో మళ్లీ గొడవలు మొదలయ్యాయి.
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అయితే మహిపాల్.. భార్యతో మాత్రమే గొడవపడే వాడని.. పిల్లలిద్దరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వాడిని.. తమతో కూడా ఎంతో సఖ్యతగా మెదిలేవాడని మహిపాల్ ఇరుగుపొరుగు వారు చెప్పారు. కాగా కొన్ని రోజుల క్రితం క్రిస్టియన్ మతం స్వీకరించినందువల్ల బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో.. మహిపాల్ సొంతూరికి కూడా వెళ్లడం మానేశాడని తెలిపారు. (చదవండి : నీ భార్య, కొడుకును కాల్చేశా!)
పనిమనిషిలా బతకడం కష్టంగా ఉంది!
మహిపాల్ సెక్యూరిటీ గార్డుగా మాత్రమే పనిచేయాలనుకున్నాడు. కానీ ఆ జడ్జి కుటుంబం అతడిని ఓ పనిమనిషిలా చూసేది. దీంతో మహిపాల్‌కి కాస్త ఇబ్బందిగా అన్పించేది. పిల్లల్ని చూద్దామన్నా సెలవు దొరికేది కాదు. అందుకే గౌరవంలేని చోట ఉద్యోగం చేయడం కష్టంగా ఉందంటూ ఎప్పుడూ అంటూ ఉండేవాడు అని మహిపాల్ స్నేహితుడు కైలాష్ సింగ్ చెప్పాడు. తనని హీనంగా చూసిన కారణంగానే వాళ్లిద్దరిపై కాల్పులు జరిపి ఉంటాడని పేర్కొన్నాడు.
సిట్‌తో దర్యాప్తు
ఈ ఘటనకు గల అసలు కారణాలు తెలుసుకునేందుకు డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిపాల్ మానసిక స్థితి సరిగా లేదనే వార్తల్ని ఖండించారు. అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని, ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. మహిపాల్‌పై గతంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని, అతడికి ఎటువంటి నేర చరిత్ర కూడా లేదని డీసీపీ సుమిత్ కుమార్ తెలిపారు. కేవలం డిప్రెషన్ కారణంగానే కాల్పులకు పాల్పడ్డాడా లేదా ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment