బాధితుడి శరీరంపై లాఠీ వాతలు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో యాంటీ గూండా స్క్వాడ్ (ఏజీఎస్) పోలీసులు గురువారం రాత్రి సెలవులో ఉన్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన అతను ఆస్పత్రి పాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మారేడుమిల్లి స్టేషన్ రైటర్‌గా పని చేస్తున్న నాయుడు అనే వ్యక్తి బంధువుల పెళ్లికి గురువారం రాజమహేంద్రవరం వచ్చారు. రాత్రి స్నేహితులతో కలసి ఏవీ అప్పారావు రోడ్డులోని సవేరా బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళ్లారు.
రాత్రి 11 గంటల సమయంలో ఏజీఎస్ పార్టీ పోలీసులు బార్ వద్దకు వచ్చి సమయం అయిపోయింది మూసేయాలని ఆదేశించారు. ఆ సమయంలో బిల్లు కట్టి బయటకు వచ్చిన బాధితుడు నాయుడు సిగరెట్ వెలిగించారు. మా ముందే సిగరెట్ తాగుతావా? అంటూ ఏజీఎస్ పార్టీలోని ఓ కానిస్టేబుల్ లాఠీతో నాయుడిని చితకబాదారు. తనను అకారణంగా కొట్టడంతో బాధితుడు ఎదురుదాడికి దిగాడు. తాను కూడా డిపార్ట్‌మెంట్ వాడినేనని చెబుతున్నా వినకుండా ఏజీఎస్ పార్టీ ఎస్సై రాంబాబు బృందంలోని దాదాపు ఎనిమిది మంది బాధితుడిని విచక్షణా రహితంగా కొట్టారు.
కాళ్లు, తొడలు, వీపు, చేతులు, మోచేతులపై తీవ్రగాయాలయ్యాయి. లాఠీ దెబ్బలతో బాధితుడి శరీరంపై వాతలు తేలాయి. బాధితుడిని చితకబాదిన ఏజీఎస్ పోలీసులు అనంతరం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి వచ్చిన ప్రకాశ్‌నగర్ ఏఎస్సై వివరాలు నమోదు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఈ విషయం ఎస్పీ బి.రాజకుమారి దృష్టికి రావడంతో కేసును తూర్పు మండలం డీఎస్పీ నాగరాజుకు అప్పగించారు.
ఆయన మొదటి సారిగా బాధితుడిపై దాడి చేసిన కానిస్టేబు ల్‌ను, బాధితుడు నాయుడిని పిలిపించి రాజీ చేశారు. ఈ విషయంపై డీఎస్పీ నాగరాజును ‘సాక్షి’ సంప్రదించగా విషయం తన దృష్టికి వచ్చిందని, పోలీసు అని తెలియక ఏజీఎస్ పార్టీ కొట్టారని, అతడి ఎదురుదాడి చేశారని పేర్కొన్నారు. అందరూ పోలీసులే కావడంతో మాట్లాడి సర్ధి చెప్పామని చెప్పారు.
సవేరా బార్ అండ్ రెస్టారెంట్ రాత్రి 11:15 గంటల వరకు ఉందని, ఈ విషయం ప్రకాశ్‌నగర్ పోలీసులకు సమాచారం రావడంతో ఏజీఎస్ పోలీసులు వెళ్లారని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి బార్లు 11 గంటలకు, మద్యం దుకాణాలు 10 గంటలలోపే కచ్చితంగా మూసివేసేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment