నేను చేసిన నేరం ఏంటి!? | Honour Killing In Maharashtra | Sakshi
Sakshi News home page

నేను చేసిన నేరం ఏంటి!?

Published Sat, Dec 22 2018 5:12 PM | Last Updated on Sat, Dec 22 2018 5:24 PM

Honour Killing In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో పరువు హత్య కలకలం రేపింది. తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే కారణంతో బాలాజీ అనే వ్యక్తి తన సోదరి భర్తను హత్య చేశాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... మహారాష్ట్రలోని తాల్కేడ్‌ గ్రామానికి చెందిన సుమిత్‌ శివాజీరావు అనే ఇంజనీరింగ్‌ విద్యార్థి తన కాలేజీమేట్‌ భాగ్యశ్రీతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో వీరి విషయం యువతి ఇంట్లో వాళ్లకు తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. కానీ కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఈ జంట పెద్దలను ఎదిరించి రెండు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

ఈ క్రమంలో సుమిత్‌పై పగ పెంచుకున్న భాగ్యశ్రీ సోదరుడు బాలాజీ అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం పరీక్ష రాసి కాలేజీ బయటికి వచ్చిన సుమిత్‌ను నడిరోడ్డుపై నరికి చంపాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి కారులో పరారయ్యాడు. ఘటన జరిగిన సమయంలో భాగ్యశ్రీ సుమిత్‌ పక్కనే ఉంది. తన భర్తను కాపాడాల్సిందిగా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రాధేయపడినా ఒక్కరు కూడా వారికి సాయం చేయలేదు. దీంతో రిక్షా వాలాను బతిమిలాడి భర్తను ఆస్పత్రికి తీసుకువెళ్లింది. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

నేను చేసిన నేరం ఏంటి..?
తన భర్తను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భాగ్యశ్రీ డిమాండ్‌ చేసింది. ‘ నేను చేసిన నేరం ఏంటి? ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? పోలీసులు నిందితుడిని త్వరగా పట్టుకుని నాకు న్యాయం చేయాలి. లేదంటే నేను కూడా ఆత్మహత్య చేసుకుంటా’  అని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భాగ్యశ్రీ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉన్న కారణంగానే పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోతున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు. ​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement