టోక్యో : సీరియల్ కిల్లర్ ఉదంతం వెలుగు చూడటంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పండింది. టోక్యోకు నైరుతి ప్రాంతంలో ఉన్న జమా పట్టణంలో ఓ అపార్ట్‌మెంట్‌లో తల, మొండాలే వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జమాలోని ఆ అపార్ట్‌మెంట్ లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగలకొట్టి సోదాలు చేశారు.
ఓ కూలర్ బాక్స్ లో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. లోపలికి వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు దర్శనమిచ్చాయి. అక్కడ కొన్ని కూలర్ బాక్స్‌లలో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న కొన్ని మృతదేహాలు వారి కంటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీపరుచుకున్న పోలీసులు.. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డారు. మొత్తం 9 మృతదేహాలు లభ్యమైనట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మైనిచి షింబన్ అనే పత్రిక కథనం ప్రచురింది. అయితే మిస్సయిన యువతి సూసైడ్ నోట్ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్‌లో కనిపించిన ఫుటేజీలు దర్శనమివ్వటంతో... ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని సదరు కథనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment