
హత్యకు గురైన వెంకటలక్ష్మి
కాకినాడ రూరల్: అదనపు కట్నం తీసుకురావడం లేదన్న అక్కసుతో కట్టుకున్న భార్యనే భర్త హత్య చేసిన సంఘటన కాకినాడ జగన్నాథపురంలో సంచలనం సృష్టించింది. జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతానికి చెందిన కర్రి పైడిరాజుకి అదే ప్రాంతానికి చెందిన కర్రి వెంకటలక్ష్మి (24)తో ఏడేళ్ల కిత్రం వివాహమైంది. ఇతను వేటకు వెళుతుండేవాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండేళ్లుగా రొయ్యపిల్లల హేచరీ పెడతానని వెంకటలక్ష్మి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నాడు. భర్త వేధింపులతో పాటు ఆడపడుచు రాఘవ అదనపు కట్నం వేధింపులు తోడయ్యాయి.
దీంతో వెంకటలక్ష్మి వేధింపులు తాళ్లలేక రెండు రోజుల క్రితం కాకినాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త పైడిరాజు, ఆడపడుచు రాఘవలపై ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యభర్తలిద్దరినీ పిలిచి సర్దిచెప్పి పంపారు. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో భర్త పైడిరాజు శుక్రవారం ఉదయం భార్య వెంకటలక్ష్మి మెడకు వేట వలకు ఉపయోగించే నైలాన్ తాడు బిగించి చంపేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని వన్‌టౌన్ సీఐ ఏ.వి.రావు పర్యవేక్షణలో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన పైడిరాజును, ఆడపడుచు రాఘవను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.