హత్యాయత్నం కేసు నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు
తాడిపత్రి: ఐకేపీ ఉద్యోగిపై జరిగిన హత్యాయత్నం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో సీసీ రామ్మోహన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను 24 గంటలలోపు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ ద్విచక్రవాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నానికి కారణమని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.
ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామ్మోహన్ వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పొదుపు సంఘాల లీడర్లు సీసీతో తరచూ సమావేశమయ్యేవారు. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లికి చెందిన మహిళతో సీసీకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్ది రోజుల్లోనేఆమెకు వెలుగు కార్యాలయంలోనే యానిమేటర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. వీరిద్దరి వ్యవహారశైలిపై ఆమె భర్త వెంకటలింగారెడ్డికి అనుమానం వచ్చింది. పలుమార్లు హెచ్చరించినా భార్య పద్ధతిలో మార్పు రాలేదు. ఒక్కొక్కసారి ఆఫీసు పనిమీద అనంతపురం వెళ్తున్నానని చెప్పి రెండు మూడు రోజులైనా ఇంటికి వచ్చేది కాదు. తన భార్యతో మాట్లాడవద్దని, పద్ధతి మార్చుకోకపోతే అంతమొందిస్తానని సీసీని వెంకటలింగారెడ్డి హెచ్చరించాడు. దీంతో సీసీ రామ్మోహన్ తాడిమర్రి నుంచి జిల్లా కేంద్రంలోని డీఆర్‌డీఏ కార్యాలయానికి బదిలీ చేయించుకున్నాడు. అయినా యానిమేటర్ తరచూ అనంతపురానికి వెళ్లి రామ్మోహన్‌ను కలిసి వచ్చేది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయితే ఆమె తన భర్తతో కలిసి ఉండలేనని తెగేసి చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న రామ్మోహన్ జిల్లా కేంద్రం నుంచి నార్పలకు బదిలీ చేయించుకున్నాడు. నాగలక్ష్మి అక్కడికి వస్తూ పోతుండేది.
అంతమొందించేందుకు రెక్కీ
తమ వైవాహిక జీవితానికి అడ్డుపడిన రామ్మోహన్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకున్న వెంకటలింగారెడ్డి తన సోదరుడు రాజారెడ్డితో విషయాన్ని చెప్పి అతడి సహాయం తీసుకున్నాడు. దీంతో వీరిరువురూ రామ్మోహన్‌ను అంతమొందించేందుకు పథకం వేశారు. ఈలోపు రామ్మోహన్ నార్పల నుంచి తిరిగి అనంతపురానికి బదిలీపై వెళ్లడంతో అక్కడ అంతమొందించేందుకు వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలు రెక్కీ నిర్వహించారు. అక్కడ కూడా వీలు కాలేదు. కానీ తాజాగా రామ్మోహన్ తాడిపత్రి వెలుగు కార్యాలయానికి బదిలీపై వచ్చాడు. విషయం తెలుసుకున్న వెంకటలింగారెడ్డి సోదరులు సోమవారం తాడిపత్రికి చేరుకున్నారు. కార్యాలయంలో రామ్మోహన్ ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన వెంకటలింగారెడ్డి సోదరులు లోనికి చొచ్చుకెళ్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. చుట్టుపక్కల వారు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు గడవకముందే దాడికి పాల్పడిన వెంకటలింగారెడ్డి, సోదరుడు రాజారెడ్డిలను అరెస్టు చేసి, వారి వద్దనుంచి ఓ ద్విచక్ర వాహనంతో పాటు మూడు వేటకొడవళ్లు, కారంపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లో హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment