కట్టల గుట్టలు | Illegal Monetary Exchange in Hyderabad | Sakshi
Sakshi News home page

కట్టల గుట్టలు

Published Mon, Nov 5 2018 10:22 AM | Last Updated on Tue, Nov 13 2018 1:40 PM

Illegal Monetary Exchange in Hyderabad - Sakshi

ఇటీవల టాస్క్‌ఫోర్స్‌ పట్టుకున్న హవాలా నగదు

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో అక్రమ నగదు నిల్వలు గుట్టలుగా బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ.. అక్రమ మార్గంలో నగదు మార్పిడి భారీగా జరుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు ఈ తరహా లావాదేవీలతో పాటు హవాలా, హుండీ ముఠాలపై డేగకన్ను వేశారు. ఫలితంగా అటు టాస్క్‌ఫోర్స్‌.. ఇటు స్థానిక పోలీసులకు వరుసగా ముఠాలు చిక్కుతున్నాయి. డీమానిటైజేషన్‌ తర్వాత అమల్లోకి వచ్చిన నిబంధనల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా దందాలు నెరపుతున్న, వెలుగులోకి రాకుండా చాపకింద నీరులా లావాదేవీలు సాగిస్తున్నవి అనేకం ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఉన్న సూత్రధారుల ఆదేశాల మేరకు నగరంలో పనిచేసే ఈ గ్యాంగ్స్‌ టర్నోవర్‌ ఏడాదికి రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసు విభాగం అంచనా వేస్తోంది.  

సహకరిస్తున్న వ్యాపారులు
వివిధ దేశాల మధ్య అక్రమమార్గంలో ద్రవ్య మార్పిడి చేయడాన్ని హవాలా అని, దేశంలోని రాష్ట్రాల మధ్య జరిగే ఈ మార్పిడిని హుండీగా పేర్కొంటారు. నగరంలో హవాలా, హుండీ దందాలు ప్రధానంగా బేగంబజార్, అబిడ్స్, హిమాయత్‌నగర్, మహంకాళి, రాణిగంజ్, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్‌ కేంద్రంగా సాగుతున్నట్టు గుర్తించారు. ప్రధానంగా బంగారం వ్యాపారులతో పాటు ఇతర బిజినెస్‌లు చేసే హోల్‌సేల్‌ వ్యాపారవేత్తలకు ఇది కలిసి వస్తోంది. బిల్లులు లేకుండా, ఆర్థిక లావాదేవీలు రికార్డెడ్‌గా చేయకుండా ఉండేందుకు అక్రమ ద్రవ్య మార్పిడిని ఆశ్రయిస్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ వ్యాపారులే బోగస్‌ ఇన్వాయిస్‌లు సృష్టిస్తూ హవాలా, హుండీ దందాలు చేసే వారికి సహకరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్‌ కావడంతో ఈ వ్యాపారానికి ఆస్కారం ఉన్న నగరంలోని అనేక ప్రాంతాలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. 

హవాలా తగ్గి.. హుండీ పెరిగి..
ఒకప్పుడు సిటీ కేంద్రంగా హుండీకి పోటీగా హవాలా వ్యాపారం సైతం నడిచేది. అయితే, పీవీ నరసింహరావు ప్రధానిగా పనిచేసిన రోజుల్లో అమల్లోకి తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈ వ్యాపారం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం కేవలం అసాంఘిక, ఉగ్రవాద కార్యకలాపాల కోసమే దీన్ని వినియోగిస్తున్నారు. హుండీ వ్యాపారం మాత్రం అంతకంతకూ పెరిగిపోతోంది. పన్ను పోటు నుంచి తప్పించుకోవడానికి అనేక మంది వ్యాపారులు ఈ మార్గాన్ని ఎంచుకోవడం నిర్వాహకులకు కలిసి వస్తోంది. ప్రస్తుతం నగరంలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 50కి పైగా హుండీ ముఠాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్వారా రోజుకు రూ.5 కోట్లకు పైనే చేతులు మారుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ దందాల సూత్రధారులంతా గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన వారే ఉంటున్నారు. పోలీసులు దాడి చేసిన ప్రతిసారి కేవలం పాత్రధారులే పట్టుబడుతున్నారుగాని దీని వెనుకున్న సూత్రదారులు మాత్రం వెలుగులోకి రాకపోవడం గనార్హం. 

పట్టిస్తున్నా వారికి పట్టట్లేదు..
అక్రమ ద్రవ్యమార్పిడి వ్యాపారంపై నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిత్యం ముఠాలను పట్టుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తున్నారు. ఇలాంటి సమాచారం ఇచ్చినా.. వ్యక్తులను పట్టించినా ప్రోత్సాహకంగా పట్టుబడిన మొత్తంలో పది శాతం ఇచ్చే ఆస్కారం ఆదాయ పన్ను శాఖకు ఉంది. అయితే, ఇప్పటికీ నగర పోలీసు విభాగానికి ఈ తరహా ‘ప్రోత్సాహమే’ అందలేదు. అక్రమ లావాదేవీల వల్ల ప్రభుత్వానికి పన్ను అందక పోవడంతో పాటు అసాంఘిక శక్తులు, మాఫియా, ఉగ్రవాదులకు అనువుగా మారే ప్రమాదం ఉందని భావించిన నగర టాస్క్‌ఫోర్స్‌ ఈ అక్రమ వ్యవహారంపై నిఘా వేసింది. ఫలితంగా హుండీ ముఠాలు పట్టుబడుతున్నాయి. అయితే, అక్రమ ఆర్థిక లావేదేవీలను పట్టిస్తున్న టాస్క్‌ఫోర్స్‌కు ప్రోత్సాహకం ఇచ్చే అంశం మాత్రం ఐటీ అధికారులు పట్టించుకోవడం లేదు.  

ఇలా పట్టుకుని అలా అప్పగించడం..
దేశ వ్యాప్తంగా హుండీ, హవాలా వ్యాపారం సాగిస్తున్న ముఠాలు ప్రధానంగా గుజరాత్‌ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ప్రధాన సూత్రధారులు అక్కడే ఉంటున్నా.. ఇక్కడున్న ఏజెంట్ల ద్వారా ఫోన్‌లో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లపై తమ వేగుల ద్వారా సమాచారం అందుకుంటున్న టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు వారిని పట్టుకుని, నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే ఆపై దర్యాప్తు, విచారణ చేసే అధికారం మాత్రం పోలీసులకు లేదు. ఈ నేపథ్యంలోనే పట్టుకున్న ప్రతి ముఠాను స్వాధీనం చేసుకున్న నగదుతో సహా ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించేయాల్సిందే. తరవాత వ్యవహారమంతా వారే చూసుకుంటారు.  

ఆ ‘పది శాతం’పై నిర్లక్ష్యం  
ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఆదాయానికి మించిన/అక్రమ ఆస్తులు, హవాలా, హుండీ వంటి వ్యవహారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చి, వాటి గుట్టును రట్టు చేయిస్తే సదరు ఇన్‌ఫార్మర్‌కు 10 శాతం కమిషన్‌గా ఇస్తారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో నగర పోలీసులే హుండీకి సంబంధించి అనేక ముఠాల గుట్టు రట్టు చేశారు. వీరి నుంచి రూ.కోట్లు స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఆనవాయితీగా ఉన్న పది శాతం అంటే.. కనీసం కొన్ని లక్షలైనా నగర పోలీసులకు రావాల్సి ఉంది. ఈ నిధులు వస్తే నగరం పోలీసు విభాగంలో అనేక మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. అలా కాకపోయినా ఈ ముఠాలను పట్టుకోవడంతో పనితీరు కనబరిచిన అధికారుకు రివార్డుగా ఇవ్వచ్చు. అయితే చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని, తమకు రావాల్సిన ‘పది శాతం’ మాత్రం ఆదాయ పన్ను శాఖను అడగడానికి మాత్రం పోలీసు విభాగం ఆసక్తి కనబరచడం లేదు. వీరి విషయం ఇలా ఉంటే.. కనీసం ఇన్‌కమ్‌ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అయినా నగర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమని, వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఇచ్చినట్లే అనే కోణంలో ఆలోచించడం లేదు. ఇకనైనా ఏదో ఒక శాఖలో అధికారులు స్పందించి ‘పది శాతాన్ని’ నగర పోలీసు సంక్షేమ నిధికి వచ్చేలా చేయాల్సిన అవసరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement