వివరాలు వెల్లడిస్తున్న ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి
అదో దొంగల ముఠా. వారు బ్లేడు పడితే.. బ్యాగు తెగాల్సిందే..ఆ ముఠా సభ్యులు ఆర్టీసీ బస్టాండ్లలో కాపు కాస్తారు. బ్యాగుల్లో నగలు తీసుకెళుతున్న ప్రయాణికులను గుర్తించి వారి వెంటే బస్సు ఎక్కుతారు. ప్రయాణికులు ఏమరపాటుగా ఉన్న సమయంలో బ్యాగు కత్తిరించి నగలు తస్కరిస్తారు. ఆ తర్వాత దారి మధ్యలోనే బస్సు దిగిపోతారు.
శ్రీశైలం టెంపుల్: ప్రయాణికుల ముసుగులో ఆర్టీసీ బస్సుల్లో చోరీకి పాల్పడే అంతర్‌జిల్లా ముఠా సభ్యురాలిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి 65 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం శ్రీశైలం పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ మాధవరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఆదినారాయణపురం గ్రామానికి చెందిన కావేటి ఆదినారాయణ, కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మి, శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీ(నాని) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ప్రయాణికుల మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణికుల బాగ్యులు కత్తిరించి నగలు, నగదు చోరీ చేసేవారు. ఈక్రమంలో వీరిపై జిల్లాలోని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, నందికొట్కూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి.
చోరీలు ఇలా..
ముఠాలో ఆదినారాయణ కీలకమైన వ్యక్తి. అక్కచెళ్లెల్లైన కావేటి అలివేలు, కావేటి వరలక్ష్మిని అతడు వివాహం చేసుకున్నాడు. వీరు ముగ్గురూ శివలీల, నాగమ్మ, ఏడుకొండలు, కర్రెద్దుల వంశీతో ముఠా కట్టారు. ఇందులో కర్రెద్దుల వంశీ తప్ప మిగతా వారంతా బస్సుల్లో చోరీలు చేసేవారు. కర్రెద్దుల వంశీ వీరు చోరీ చేసి తెచ్చిన బంగారాన్ని కరిగించి అమ్మేవాడు. అనంతరం వచ్చిన డబ్బును అందరూ కలిసి పంచుకునేవారు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా వీరు చీరాల, అద్దంకి, ఒంగోలు, కడప, మైదుకూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేశారు.
పట్టుబడిందిలా..
ఏడాది క్రితం నందికొట్కూరుకు చెందిన శివరత్నమ్మ ఆర్టీసీ బస్సులో కర్నూలు నుంచి నందికొట్కూరుకు బయలుదేరింది. ఆమెను వెంటాడిన దొంగల ముఠా సభ్యులు ఆమె బ్యాగును కత్తిరించి అందులో ఉన్న 44 తులాల బంగారును తస్కరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో నందికొట్కూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. దాదాపు 8 నెలలపాటు బృందం సభ్యులు మఫ్టీలో ఉంటూ ముఠా సభ్యుల కోసం గాలించారు. ఈక్రమంలో ముఠా సభ్యురాలైన కావేటి అలివేలు శనివారం నందికొట్కూరులోని బంగారు దుకాణాల ముందు అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మొత్తం 85 తులాల బంగారు నగలు చోరీ చేసినట్లు అంగీకరించింది. ఇందులో 30 తులాలు బంగారం తన వద్ద ఉండగా మరో 35 తులాల బంగారాన్ని చీరాలలో మణప్పురం గోల్డ్‌లోన్‌లో తాకట్టు పెట్టినట్లు ఒప్పుకుంది. ఒంగోలు సీసీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్ బాలుకు 10 తులాల బంగారు అమ్మినట్లు తెలియజేసింది. నిందితురాలి నుంచి రూ.16 లక్షల విలువైన 65 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దొంగబంగారం కొనుగోలు చేసిన ఒంగోలు సీసీఎస్ కానిస్టేబుల్‌పై విచారణ చేపడతామన్నారు.
సిబ్బందికి రివార్డులు..
అంతర్ జిల్లా ముఠా గుట్టును రట్టు చేసిన నందికొట్కూరు పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈసందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది ఏ ప్రసాద్‌ఆచారి, బషీర్‌బాషా ,ఐ శ్రీనివాసులు, సి నాగరాజు, నభీసొలేల్ల,ఏ ఖాజాలకు రివార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో శ్రీశైలం, ఆత్మకూరు, నందికొట్కూరు సీఐలు ఎల్లమరాజు, కృష్ణయ్య, వెంకటరమణ, నందికొట్కూరు, మిడుతూరు, శ్రీశైలం ఎస్‌ఐలు చంద్రశేఖరరెడ్డి, సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment