
పద్మావతి కళాశాల సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
శ్రీకాకుళం ,పోలాకి : అనుమానాస్పదస్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఓ పంట కాలువలో ఇతడి మృతదేహం లభ్యమయింది. మృతుని బంధువులు, పోలీసులు, కళాశాల సిబ్బంది కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన కొర్లాపు సురేష్(18) నరసన్నపేట పట్టణంలో పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయాన్నే కళాశాలకు వచ్చిన సురేష్ పోలాకి సమీపంలో శవమై పడివుండటం మిస్టరీగా మారింది. సంతలక్ష్మీపురం జంక్షన్ సమీపంలో ఓ పంట కాలువలో శుక్రవారం సాయంత్రం ఇతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీరు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
ఇటువైపు ఎందుకు వచ్చినట్టు
సురేష్ పోలాకి వైపు ఎందుకు వచ్చాడు అనేది మిస్టరీగా మారింది. ఉపకారవేతనం కోసం బయోమెట్రిక్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్‌కు వెళ్లినట్టు పద్మావతి జూనియర్ కళాశాల సిబ్బంది చెబుతున్నప్పటికీ... పోలాకి ఆధార్ కేంద్రంలో శుక్రవారం 19 మంది విద్యార్థులకు బయోమెట్రిక్ చేశామని అందులో సురేష్ అనే పేరుతో ఎవరూ లేరని ఆధార్ సెంటర్ నిర్వాహకుడు రవి పోలీసులకు తెలిపారు.
ఫిట్స్ జబ్బు కారణమా..?
ఘటనాస్థలానికి చేరుకున్న మృతుడు బంధువులు సురేష్‌కు ఫిట్స్ జబ్బు ఉందని దానికి మందులు వాడుతున్నామని తెలిపారు. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. అయితే నిత్యం జనసంచారం ఉండే రహదారి పక్కనే ఇంత పరిస్థితి వచ్చేవరకు ఎవరూ గమనించకుండా ఉండరు. దీంతో పాటు మృతదేహం రోడ్డుపై కాకుండా కాలువలో పడివుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సంఘటనపై స్థానిక ఎస్‌ఐ అబ్రహం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట తరలించారు. కాగా, మృతుని తండ్రి లక్ష్మణరావు సొంత గ్రామం సంతబొమ్మాళి మండలం నువ్వలరేవు. కొన్నేళ్ల కిందట భార్యభర్తల మధ్య వివాదంతో తల్లి అమ్మన్నమ్మతో కలిసి బుడితి వచ్చి నివాసం ఉంటున్నారు.