
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో తాను ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన తమ్ముడు ఇక్బాల్ కస్కర్ చెప్పాడు. అరెస్ట్‌కు ముందు దావూద్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు థానే కోర్టులో ఇక్బాల్ ఒప్పుకున్నాడు. వెంటనే ఇబ్రహీం ఎక్కడున్నాడని, అతని ఫోన్ నెంబర్ ఏంటని జడ్జి ప్రశ్నించగా.. మొబైల్ నెంబరు డిస్‌ప్లే కాలేదని, అతడెక్కడున్నదీ తాను తెలుసుకోలేకపోయానని న్యాయమూర్తికి తెలిపాడు.
దోపిడీ కేసు విచారణలో భాగంగా కస్కర్‌ను థానె పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్‌వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. ఈ కేసు విచారణ క్రమంలో దావూద్‌తో మాట్లాడిన విషయాన్ని కస్కర్ ఒప్పుకున్నాడు. దావూద్ ఇబ్రహీం గతంలో లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడని, అప్పుడు మధ్యవర్తిగా రామ్ జెఠ్మలానీ వ్యవహరించాలని కస్కర్ తరుఫు న్యాయవాది శ్యాం కేస్వాని చెప్పారు. కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ తన తరఫు న్యాయవాది ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాడని, కేసు విచారణ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అర్థర్ రోడ్ జైలులో తనను ఉంచుతానంటేనే లొంగిపోతానని దావూద్ తెలియజేసినట్టు శ్యామ్ కేశ్వాని పేర్కొన్నారు. ఈ షరతులకు ప్రభుత్వం నిరాకరించిందని, దావూద్‌ను అరెస్ట్ చేయలేదని తెలిపారు. దీంతో దావూద్ ఇబ్రహీం లొంగిపోలేదని చెప్పారు.
దావూద్ సోదరుడు కస్కర్‌పై, ఆయన గ్యాంగ్ సభ్యులపై దోపిడీ కేసు నమోదైంది. శ్యాం సుందర్ అగర్వాల్ అనే వ్యక్తి బోరివల్లిలో ప్లాట్ కొనుగోలు చేశాడు. అయితే ఈ ప్లాట్ విషయంలో కస్కర్, అగర్వాల్‌ను బెదిరించాడు. ఆ ప్లాట్‌ను బలవంతంగా మరో వ్యక్తికి బదిలీ చేయించాడు. ప్రస్తుతం డయాబెటిస్ వల్ల కాలుకు కలిగిన గాయంతో కస్కర్‌కు మెడికల్ చికిత్స అవసరమని శ్యాం కేస్వాని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సివిల్ ఆసుపత్రిలో అతనికి పోలీసులు చికిత్స అందించాలని, మార్చి 9 వరకు కస్కర్ కస్టడీ కొనసాగుతుందని జడ్జి తెలిపారు.