పత్తికొండ టౌన్: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం విద్యార్థినుల కిడ్నాప్ కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థినులను దుండగులు ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి విద్యార్థినులు తప్పించుకున్నారు. బాధిత విద్యార్థినుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పత్తికొండ పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశా, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తర్వాత సాయంత్రం ఫర్జానా అనే విద్యార్థిని తనకు కడుపునొప్పి ఉందని చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో దుండగులు వచ్చారు.
విద్యార్థినులను బలవంతంగా ఆటోల్లోకి ఎక్కించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారంతా తలకు మంకీ క్యాప్‌లు ధరించారని విద్యార్థినులు చెపుతున్నారు. ఫర్జానా ఆటోలో నుంచి దూకి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం అందించింది. ఆటోల్లో ఉన్న ఐదుగురు విద్యార్థినులను దుండగులు బ్లేడ్లతో గాయపరిచి, వదిలివెళ్లినట్లు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థినులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సదరు విద్యార్థినులను ఎస్‌ఐ మధుసూదన్‌రావు విచారణ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. సీఐ విక్రంసింహా, ఎస్‌ఐ మధుసూదన్‌రావు విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment