
చంద్రబాబుతో మామిళ్లపల్లి దీప్తి (ఫైల్)
పెదకాకాని(పొన్నూరు): ఉద్యోగాలిప్పిస్తానంటూ టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వసూలు చేసి ఘరానా మోసాలకు పాల్పడిన కిలాడి లేడీ మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎట్టకేలకు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పెదకాకానికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్‌ఐ అనురాధ చెప్పారు.
అప్పట్లో సీఎంవోలో పీఏగా పనిచేస్తున్నట్టు నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడిపే క్రమంలో ఈ మోసాలకు పాల్పడ్డానని పోలీసుల విచారణలో ఆమె చెప్పినట్టు తెలిసింది. కాకుమాను మండలం బోడుపాలేనికి చెందిన దీప్తి టీడీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయంలో హల్‌చల్ చేసేది. మంత్రుల శాఖల కార్యాలయాల్లోకి వెళ్లి వస్తూ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ.. ఉద్యోగాల పేరుతో వారి నుంచి డబ్బు గుంజేది.
వ్యవహారం వెలుగులోకి వచ్చిందిలా..
వైఎస్సార్ జిల్లాకు చెందిన వల్లభరెడ్డి రామకృష్ణారెడ్డి ఐదుగురికి ఏపీ జెన్‌కోలో ఉద్యోగాలిప్పించేలా దీప్తితో ఒప్పందం కుదుర్చుకుని గతేడాది ఏప్రిల్ 15న ఆమెకు రూ.12.50 లక్షలు చెల్లించాడు. గుంటూరుకు చెందిన ప్రత్తిపాటి దిలీప్, మోహనరావు కూడా ఉద్యోగాల నిమిత్తం ఆమెకు రూ.6.50 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత తాము మోసపోయామని గుర్తించిన వీరు గతేడాది అక్టోబర్ 15న పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆమె చేసిన మోసాలపై అప్పట్లో ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో బాధితులు మరింత మంది ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఆమె పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ఈ నెల 4న తెనాలిలో చంద్రబాబు, లోకేశ్‌లు హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న దీప్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించగా పరారైంది.
Comments
Please login to add a commentAdd a comment