
బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ
గూడూరు: ఓ దుండగుడు పట్టపగలు తలకు మాస్క్ వేసుకుని ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. భర్త మెడపై కత్తి పెట్టాడు. అరిస్తే గొంతు కోసేస్తా.. మెడలో సరుడు తీసివ్వు అంటూ భార్యను బెదిరించి 5 సవర్ల బంగారు చైన్ దోచుకెళ్లాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని రాణీపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాణీపేట ప్రాంతంలోని మూడో వీధిలోని ఓ ఇంట్లో మేడపై వెంకటసుబ్బయ్య, దాక్షాయణమ్మ అనే వృద్ధ దంపతులుంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బయట బాల్కనీలో ఓ వ్యక్తి తలకు మాస్క్ వేసుకుని తిరుగుతుండడంతో వెంకటసుబ్బయ్య తలుపు తీశాడు. ‘ఎవరు కావాలి బాబూ’ అని అడుతుండగా అతను వెంకటసుబ్బయ్యను నెట్టుకుంటూ ఇంట్లోకి ప్రవేశించాడు.
వెంటనే తన వద్ద ఉన్న కత్తిని వెంకటసుబ్బయ్య మెడపై పెట్టాడు. దీంతో ఆయన ‘ఎవరయ్యా నువ్వు.. తమాషా పడుతున్నావా’ అని అడగ్గా.. దుండగడు కత్తితో మెడపై బలంగా నొక్కే ప్రయత్నం చేశాడు. ఇంతలో దాక్షాయణమ్మ బయటకు వచ్చింది. భర్త మెడపై కత్త చూసి అరిచేందుకు ప్రయత్నించగా, ఆ దొంగ ‘అరిస్తే నీ భర్త గొంతు కోసేస్తా. వెంటనే నీ మెడలోని సరుడివ్వు’ అని బెదిరించాడు. వెంకటసుబ్బయ్య మెడపై కత్తితో గట్టిగా నొక్కసాగాడు. దీంతో భయపడిపోయిన దాక్షాయణమ్మ తన మెడలోని 5 సవర్ల బంగారు సరుడును తీసి దొంగ చేతిలో పెట్టింది. వెంటనే అతను పరారయ్యాడు. బాధితులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ దశరథరామారావు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.