నూర్పిడి యంత్రం కిందపడి మృతిచెందిన కూలీలు , జయమ్మ, పరకాల బాలరాం, శాంతమ్మ మృతదేహాలు
సాక్షి, నాగర్‌కర్నూల్ రూరల్: మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ నూర్పిడి యంత్రం కిందపడి ముగ్గురు కూలీలు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి వెంకట్‌రెడ్డికి చెందిన వేరుశనగ నూర్పిడి యంత్రం మండలంలోని నల్లవెల్లిలో వేరుశనగ చెత్తను నూర్పిడి చేసేందుకు బుధవారం గ్రామానికి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ రైతు ఆంజనేయులు పొలంలో వేరుశనగ పంటను నూర్పిడి చేసేందుకు వెళ్లారు.
సాయంత్రం వరకు పనిపూర్తి చేసి యంత్రం వెంబడి వెళ్లిన కూలీలను తీసుకొని వస్తుండగా కేఎల్‌ఐ సబ్‌కెనాల్ వద్ద చిన్నపాటి గుంత రావడంతో నూర్పిడి యంత్రం ఒక వైపు ఒరిగి అటువైపుగా ఉన్న నలుగురు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో లింగసానిపల్లికి చెందిన గడ్డమీది జయమ్మ(35), పరకాల బాలరాం (50), శాంతమ్మ (35) నూర్పిడి యంత్రం కింద మృతిచెందారు. బోనాసి సత్యమ్మకు కాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి.
ఆమెను చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ సందర్భంలో మరోవైపు వున్న ఆరుగురు కూలీలకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. విషయం తెలుసుకున్న నల్లవెల్లి గ్రామస్తులు ప్రమాదసంఘటన స్థలానికి చేరుకుని నూర్పిడి యంత్రం కిందపడి మృతిచెందిన మృతదేహాలను బయటకు తీసి జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్దలానికి చేరుకుని ప్రమాద సంఘటనపై విచారణ చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment