మొయినాబాద్(చేవెళ్ల): న్యాయవాద వృత్తిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనకు విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించి పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ నగరానికి చెందిన విద్యార్థిని(20) మొయినాబాద్ అమ్డాపూర్ చౌరస్తాలో ఉన్న జేబీఐఈటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. గురువారం నగరంలోని మెహదీపట్నం నుంచి కళాశాలకు వచ్చేందుకు పరిగి డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తున్న వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన న్యాయవాది వెంకటరాములు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
విద్యార్థిని రెండు మూడుసార్లు చెప్పినా అతని తీరు మారలేదు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో విసిగిపోయిన విద్యార్థిని బస్సులోనే అతని చెంప చెళ్లుమనిపించింది. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సును ఆపి అతడిని పోలీసులకు అప్పగించింది. పోలీసులు సదరు న్యాయవాదిపై కేసు నమోదు చేశారు.