
కృష్ణప్రసన్నకుమార్‌ను విలేకరుల ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ స్వరూపారాణి
రాజాం సిటీ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి కోరిక తీర్చుకున్న అనంతరం మొహం చాటేసిన ఓ యువకుడిన పోలీసులు అరెస్టుచేశారు. ఆమెతో శృంగారం చేసిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. నగ్నచిత్రాలు చూపించి బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేసిన ఘనుడు కటకటాల పాలుకానున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పాలకొండ డీఎస్పీ జి.స్వరూపారాణి శుక్రవారం తెలిపిన వివరాలు ఇలావున్నాయి. రాజాం పట్టణంలో తెలగవీధికి చెందిన గట్టి కృష్ణప్రసన్నకుమార్ అనే యువకుడు కొన్నాళ్లుగా ఇదే పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడు.
పెళ్లిచేసుకుంటానని నమ్మబలికి శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెతో శృంగారం చేసిన చిత్రాలు, వీడియోను మొబైల్ ఫోన్‌లో బంధించి భద్రపరిచాడు. ఇలా కొన్నాళ్లు జరిగిన అనంతరం ఆమెకు మొహం చాటేశాడు. కొద్ది రోజుల తర్వాత పెళ్లిచేసుకోవాలని బాధితురాలు నిలదీయడంతో వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. తనను ఒత్తిడి తెస్తే ఈ చిత్రాలు బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు. అయితే ఈలోగా వీరి శృంగారానికి సంబంధించిన నీలిచిత్రాలు వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమయ్యాయి.
దీంతో మోసపోయిన యువతి తల్లిదండ్రులతో కలిసి రాజాం టౌన్ సర్కిల్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. సీఐ శంకరరావు కేసు నమోదు చేయగా పాలకొండ డీఎస్పీ స్వరూపారాణి ప్రత్యేక పర్యవేక్షణలో రెండు రోజుల పాటు దర్యాప్తు నిర్వహించారు. అనంతరం నిందితుడు కృష్ణప్రసన్నకుమార్‌ను పట్టుకోవడంతో అతడు తప్పు ఒప్పుకోవడం వల్ల అరెస్టుచేసి శుక్రవారం విలేకరుల ముందు హాజరుపరిచారు. మోసపోయిన యువతి దళిత కుటుంబానికి చెందినది కావడంతో ఎస్సీ, ఎస్టీ, సైబర్ క్రైం విభాగంలో కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్టు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.
మహిళా కమిషన్ అండగా ఉంటుంది
దగాపడ్డ యువతికి మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి అన్నారు. విషయం తెలుసుకున్న ఈమె రాజాం పోలీసుస్టేషన్‌కు శుక్రవారం చేరుకుని బాధిత యువతితో మాట్లాడారు. యువతి తీవ్ర ఒత్తిడికి గురై భయపడుతుందని, ఈమెను స్టేట్‌హోంకు తరలించి రక్షణ కల్పిస్తామని విలేకరులకు తెలిపారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో ఇటీవల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ ఎవరూ భయపడకపోవడం విచారకరమని, దోషులకు శిక్ష పడే విధంగా కృషిచేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment