పోలీసులకు పట్టుబడ్డ క్యాబ్ డ్రైవర్ కిరణ్
క్యాబ్‌లో ఎక్కాక చేతులు ఊరికే ఉండవు. ఫోన్ తీసి కబుర్లు చెప్పమంటాయి. కాని కబుర్లు మరీ పర్సనల్ అయినప్పుడు, అవి విన్న డ్రైవర్‌కు దుర్బుద్ధి పుడితే నరకం అనుభవించాల్సి ఉంటుంది. బెంగళూరులో క్యాబ్ ఎక్కిన మహిళ ఫోన్‌లో చేసిన పర్సనల్ టాక్‌ను విన్న డ్రైవర్ ఆమెను ఏడు నెలలుగా బ్లాక్‌మెయిల్ చేసి 40 లక్షలు గుంజాడు. అనుకోకుండా దొరికాడు. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో! ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?
స్త్రీలు విధులు, ఉపాధికి బయటకు వెళ్లక తప్పదు. ఇప్పుడున్న ప్రయివేటు రవాణా యాప్‌లను నమ్ముకోకా తప్పదు. ఇలాంటి యాప్‌లలో పని చేసే డ్రయివర్లు నూటికి తొంభై తొమ్మిది మంది తమ బతుకు తెరువు కోసం పని చేస్తున్నా ఒకరిద్దరు ప్రమాదకరంగా మారుతున్నారు.
ఇటీవల బెంగళూరులో ఒక మహిళ టూ వీలర్ బుక్ చేసుకుంటే ఆమెను వెనుక కూచోబెట్టుకున్న డ్రైవర్ ఆమె చూసేలా తన శరీరాన్ని తాను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటే ఆమె మధ్యలో బైక్ మీద నుంచి దూకేయాల్సి వచ్చింది. ఇప్పుడు వెలికి వచ్చిన మరో ఘటన ఒంటరి స్త్రీలు ఎంత జాగ్రత్తగా క్యాబ్ లేదా టూ వీలర్ వ్యవస్థను ఉపయోగించుకోవాలో తెలుపుతోంది.
అసలేం జరిగింది?
ఇది నవంబర్ 2022లో జరిగింది. బెంగుళూరులో ఒక వివాహిత క్యాబ్ మాట్లాడుకుని ఇంటినుంచి బయలుదేరింది. క్యాబ్‌లో వెనుక సీట్‌లో కూచుని ఫోన్ తీసి మిత్రుడితో మాట్లాడసాగింది. అప్పటికే డిప్రెషన్‌లో ఉన్న ఆమె తన మిత్రుడితో ఇంటి సమస్యలు చెప్పుకుని, త్వరలో విడాకులు తీసుకుందామనుకుంటున్న ఆలోచన చెప్పి, మిత్రునితో సాన్నిహిత్యపు మాటలు మాట్లాడింది. తను క్యాబ్‌లో ఉన్నానని ఇంకో వ్యక్తి ఆ మాటలు వింటున్నాడని మర్చిపోవడం ఆమె తప్పు.
ఈ మాటలన్నీ విన్న క్యాబ్ డ్రైవర్ ఆమెను గమ్యంలో దింపి సోషల్ మీడియా ద్వారా ఆమెనూ ఆమె భర్తనూ గుర్తించాడు. తర్వాత ఆమెకు కాల్ చేసి ఆ రోజు తాను విన్న సంగతంతా భర్తకు చెప్పేస్తానని, మరో పురుషుడితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావని చెప్పేస్తానని బెదిరించాడు. ఆ వివాహిత హడలిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియక భయపడిపోయింది. దాంతో క్యాబ్ డ్రైవర్ ఆమె నుంచి గత ఏడు నెలలుగా డబ్బు గుంజడం మొదలెట్టాడు.
ఆమె తన దగ్గరున్న 20 లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. అయినప్పటికీ ఆశ చావక వేధిస్తుండటంతో తల్లిగారి ఇంటికి వెళ్లి తల్లికి చెందిన 20 లక్షల విలువైన నగలు తెచ్చి ఇచ్చింది. పరువు మర్యాదలు ఎలా కాపాడుకోవాలో తెలియక, మరోవైపు ఈ క్యాబ్ డ్రైవర్ పెడుతున్న నరకం నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక సతమతమైంది. ఇంత జరుగుతున్నా ఆమె ఈ విషయాన్ని భర్తకు కాని, పోలీసులకు కాని తెలిపే ధైర్యం చేయలేదు. అయినప్పటికీ దుర్మార్గుడు దొరికాడు.
జాగ్రత్త... మాటలు వింటారు
మీ మాటలు, చాటింగ్ ప్రతిదీ అపరిచితుల కంట పడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం స్త్రీలకు ఉంది. అపరిచితుల ఎదుట ఫోన్లలో పర్సనల్ విషయాలు మాట్లాడకపోవడం, ఇంట్లో ఒంటరిగా ఉంటుంటే గనక అలాంటి వివరాలు చెప్పకపోవడం, ఏ సమయంలో ఎక్కడ ఉండేది చెప్పకపోవడం చాలా ముఖ్యం. అలాగే ఫోన్ క్యాబ్‌లో వదిలి ఏదైనా కొనడానికి కిందకు దిగకూడదు.
పిల్లల స్కూల్ టైమింగ్స్, డ్రాపింగ్ పికప్ వంటి విషయాలు ఫోన్‌లో డ్రైవర్ వినేలా చెప్పకూడదు. డబ్బు విషయాలు కూడా. అలాగే డ్రైవర్‌తో కాలక్షేపం కబుర్లు కూడా మంచివి కావు. ఏ క్యాబ్ డ్రైవర్ అయినా ఏ కొంచెం ఇబ్బంది పెట్టినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యలను కుటుంబం అర్థం చేసుకుంటుంది. వాటిని అడ్డు పెట్టి ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీ... ముఖ్యంగా స్త్రీలది. తస్మాత్ జాగ్రత్త!
ఎలా దొరికాడు?
జూలై 24న బెంగళూరులోని రామ్మూర్తి నగర్‌లో ఒక క్యాబ్ ఆగి అందులో కొందరు పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు గమనించారు. రాత్రిపూట అలా క్యాబ్‌లో పార్టీ చేసుకోవడం సరికాదని హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే వెళుతూ ఉండగా ఎస్.ఐకి అనుమానం వచ్చింది. క్యాబ్‌లో ఉన్నది డ్రైవర్ స్థాయి మనుషులు. వారు తాగుతున్నది గ్లెన్లివట్ విస్కీ. ఆ బాటిల్ ధర బెంగళూరులో 9,900. అంత ఖరీదైన బాటిల్ ఎక్కడిదని డ్రైవర్‌ని పేరడిగితే ‘ప్రవీణ్’ అని చెప్పాడు.
ఐడి కార్డులో కిరణ్ అని ఉంది. దాంతో పోలీసులకు పూర్తిగా అనుమానం వచ్చింది. ఆ క్యాబ్‌కు డ్రైవర్ అతడే. మిగిలినవారు స్నేహితులు. కిరణ్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తగు మర్యాదలు చేశాక మొత్తం కక్కాడు. పోలీసులు అవాక్కయ్యి ఆ వివాహితను, ఆమె భర్తను కలిసి విషయం చెప్పారు. అయినప్పటికీ వారు కేసు పెట్టడానికి సంశయిస్తే బాధితుల పేర్లు బయటకు రాకుండా చూస్తామని హామీ ఇచ్చి కేసు పెట్టించారు. వెంటనే కిరణ్‌ని అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన నగలన్నీ బయటకు తెచ్చారు. డబ్బు మాత్రం అతడు బెట్టింగ్‌లో ఖర్చు పెట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment