
ఆత్మహత్య చేసుకున్న మంజుల, రంజిత్‌కుమార్
తిరువళ్లూరు: వివాహితుడైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన యువతిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలుసుకుని ప్రియుడు సైతం బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పోలీవాక్కంకు చెందిన మురుగన్ కుమారుడు రంజిత్‌కుమార్ (24). ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన సుకన్యతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది.రంజిత్‌కుమార్‌కు తన ఇంటి ఎదురుగా ఉన్న మంజుల (18)తో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం మంజుల కుటుంబీకులకు తెలియడంతో ఆమెకు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.
తనకు రంజిత్‌కుమార్‌తో వివాహం జరిపించాలని మంజుల తల్లిదండ్రులను వేడుకుంది. వివాహమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లితండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన మంజుల బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రియుడికి సెల్‌ఫోన్‌లో మెసేజ్ పెట్టి ఉరి వేసుకుంది. రంజిత్‌కుమార్ హుటాహుటిన ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా మంజుల ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. మంజుల మృతదేహాన్ని కిందకు దింపిన అనంతరం రంజిత్‌కుమార్ నేరుగా సమీపంలోని మామిడి తోటకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇరువురి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనవాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment