రాచకొండ సీపీ మహేశ్ భగవత్(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దొంగల గ్యాంగ్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్న బాబ్లీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... సెప్టెంబరు 4న కుషాయిగూడలోని నగల దుకాణంలో ఉన్న చోరీ జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున షాపులో చొరబడ్డ దొంగలు వెండి మొత్తం దోచేశారని పేర్కొన్నారు. క్రైమ్‌సీన్ పరిశీలనలో భాగంగా దొరికిన ఓ బ్యాగ్ ద్వారా చోరీ కేసు ఛేదించామన్నారు. దొంగలను బిహార్‌కు చెందిన అరారి గ్యాంగ్‌గా గుర్తించామని... వారిని పట్టుకోవడంలో బిహార్ పోలీసుల సహకారం మరువలేనిదని ధన్యవాదాలు తెలిపారు.
చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడిస్తూ....‘ చోరీ తరువాత దొంగల గ్యాంగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్‌కు బయల్దేరింది. వారి కోసం పట్నా, బిహార్ రాష్ట్రమంతా గాలింపు మొదలు పెట్టాము. రన్నింగ్ ట్రైన్‌లోనే వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేశాము. అలా ధానాపూర్ రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌ని పట్టుకున్నాము. గ్యాంగ్‌కి బాబ్లీ మహుమ్మద్ అనే వ్యక్తి లీడర్‌గా ఉన్నాడు. అతడిపై గతంలో హత్య కేసుతో పాటు అనేక ఇతర కేసులు ఉన్నాయి. మొత్తం రూ. 11 లక్షల 49 వేలు నగదు..11 తులాల బంగారం, చోరికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నాము. ఈ గ్యాంగ్ కీసరలో కూడా చోరికి పాల్పడ్డట్టు గుర్తించాము. గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశాము. హైదరాబాద్ వచ్చే ముందు కర్ణాటక, గోవాలో కూడా వీళ్లు తిరిగారు. నిజానికి జ్యూవెలరి షాపు యజమాని సెక్యూరిటీ విధానం వల్ల.. కేసును తొందరగా ఛేదించేందుకు అవకాశం దొరికింది అని పేర్కొన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయవద్దని సీపీ మహేశ్ భగవత్ విఙ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల 9వందలకు పైగా గణేష్ విగ్రహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. నిన్నటి వరకు 9 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని వెల్లడించారు. రాచకొండ పరిధిలోని 25 ప్రాంతాల్లో అన్ని శాఖ సమన్వయంతో నిమజ్జనం జరుగుతుందన్నారు. గురువారం బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆరు గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 250 సీసీటీవీ ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుందని..మొత్తం 9 వేల కెమెరాలతో జియో ట్యాగింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5060 సిబ్బంది గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారని సీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment