
యోగేష్ జోగారామ్
సాక్షి, సిటీబ్యూరో: హోల్‌సేల్ బంగారం వ్యాపారం పేరుతో పలువురు నగల దుకాణాల యజమానుల నుంచి దాదాపు ఏడు కేజీల బంగారం సేకరించి గుజరాత్‌కు పారిపోయిన వ్యాపారి యోగేష్ జోగారామ్ సాయినిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. దాదాపు ఏడాది పాటు ముమ్మరంగా గాలించిన నేపథ్యంలోనే ఇతడు చిక్కాడని, నిందితుడి నుంచి 670 గ్రాముల బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్ కేంద్రంగా 2016లో యోగేష్ రోనక్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. జ్యువెలరీ దుకాణాల యజమానుల నుంచి పాత బంగారు నగలు, నగదు తీసుకునే ఇతను వారికి బంగారం బిస్కెట్లు, కొత్త నగలు అందించేవాడు. ఇందుకు గాను కొంత కమీషన్ తీసుకునేవాడు. సికింద్రాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోని జ్యువెలరీ దుకాణ యజమానులు ఇతడి కస్టమర్లుగా ఉండేవారు.
గత ఏడాది ‘ఎం6 బిజినెస్’గా పిలిచే ఆన్‌లైన్ ట్రేడింగ్ అయిన బులియన్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. మార్కెట్ పతనం కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో అప్పటికే వివిధ దుకాణ యజమానుల నుంచి తీసుకున్న 7 కేజీల బంగారంతో ఉడాయించాడు. కేజీకి పైగా బంగారం కోల్పోయిన ఎస్.ప్రవీణ్ జైన్ ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న యోగేష్ కోసం సబ్ ఇన్‌స్పెక్టర్ పి.విజయ భాస్కర్ నేతృత్వంలోని బృందం ముమ్మరంగా గాలించింది. నగరం నుంచి పారిపోయిన ఇతను గుజరాత్‌కు వెళ్లి అక్కడ మరో దుకాణం ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న స్పెషల్ టీమ్ నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి 670.79 గ్రాముల బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు స్వాధీనం చేసుకున్నారు. యోగేష్‌ను అక్కడి కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment