వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు , నిందితుడు రామకృష్ణ
భాగ్యనగర్‌కాలనీ: టెన్నిస్ కోచింగ్ పేరుతో చిన్నారుల కుటుంబ సభ్యులతో సన్నిహింతగా ఉంటూ వారి ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్టు చేసి అతడి నుంచి రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి హెచ్‌ఎంటీ శాతవాహన నగర్‌లో ఉంటున్నాడు. టెన్నిస్ కోచ్‌గా పరిచయం చేసుకున్న అతను పరిసర ప్రాంతాల్లోని పలువురు క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో సర్ధార్ పటేల్ నగర్‌కు చెందిన ఓ బాలుడికి కోచింగ్ ఇస్తున్న అతను బాలుడి కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో సదరు బాలడిని ఇంటికి వెళ్లి కుమారుడిని తీసుకురావటం శిక్షణ అనంతరం ఇంట్లో దిగబెట్టడం చేసేవాడు. గత నెల సదరు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి తీర్థయాత్రలకు వెళ్లారు. తాళం చెవి కిటికీ సమీపంలో పెట్టడాన్ని గుర్తించిన రామకృష్ణ తాళం తీసి ఇంట్లోకి చొరబడి బీరువా తాళం పగల గొట్టి అందులో ఉన్న 11.5 తులాల బంగారు నగలు, 1.5 కేజీల వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు. యాత్ర నుంచి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానస్పదంగా కనిపించిన రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
అతను 2018లో ఇదే తరహాలో మరో ఇంటిలో బైక్, మిక్సీ, ఎల్‌ఈడీ టీవీ దొంగలించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. కాగా అతను రాజమండ్రిలో గతంలో పలు మార్లు చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లుగా తెలిపారు. చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు. సమావేశంలో కూకట్‌పల్లి ఏసీ పీ సురేందర్‌రావు, సీఐ లక్ష్మీనారాయణ, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సైదులు, ఎస్‌ఐలు హరిశంకర్, రామచంద్రయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment