సాక్షి, గుంటూరు: ఆన్‌లైన్‌లో యువతులను బుక్ చేసుకుని మోసపోయిన ఓ యువకుడు అదే ఫార్ములాను ప్రయోగించి 507 మందిని మోసం చేశాడు. వారి వద్ద నుంచి సుమారు రూ.21.28 లక్షలు కాజేశాడు. తాజాగా అతడి చేతిలో మోసపోయిన ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో అతడి గుట్టు రట్టయింది. ఆన్‌లైన్‌లో అందమైన యువతుల ఫోటోలను ఉంచి, వారిని సరఫరా చేస్తానంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో యువతుల ఫోటోలను చూసి అక్కడ ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించి గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకడు ఆన్‌లైన్ ద్వారా రూ.17,500 వారికి బదిలీ చేశాడు. అనంతరం వారిక ఫోన్ చేయగా తన నంబరును బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తేలడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘా పెట్టారు.
ఈ క్రమంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బసచేసేందుకు యత్నించిన యువకుడిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపన్నపల్లి గ్రామానికి చెందిన వీరం రెడ్డి సుమన్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉంటున్నాడు. ఆన్‌లైన్‌లో యువతులను బుక్ చేసుకొని అక్కడ మోసపోయాడు. అదే విధానంలో తాను కూడా చేయవచ్చని ఆర్నెల్ల నుంచి అందమైన యువతుల ఫోటోలను పెట్టి ఇప్పటివరకు 507 మందిని మోసం చేసి లక్షల డబ్బును కాజేశానని అంగీకరించాడు. అతని వద్ద ఉన్న రూ.8 లక్షల నగదు, కారు, ల్యాప్‌ట్యాప్, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు సౌమ్యలత, డి. ప్రసాద్, సీఐ వై. శ్రీధర్ రెడ్డి, ఎస్‌ఐ భాగ్యరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment