
సాక్షి, మహబూబాబాద్ : దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతుంటే.. ఓ వ్యక్తి మాత్రం జాతీయ జెండాను తగలబెట్టాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిరుమలపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లిక్ డే సందర్భంగా తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే ఆ సమయంలో గ్రామ సర్పంచ్ రాంబాబు అక్కడ లేనట్టుగా తెలుస్తోంది. దీంతో సర్పంచ్ లేకుండానే జాతీయ జెండా ఎగరవేస్తారా అంటూ రాంబాబు సోదరుడు హంగామా సృష్టించాడు. కోపంతో జాతీయ జెండాను తగలబెట్టాడు. దీనిపై కారోబర్ రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సర్పంచ్ సోదరున్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ అంశం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ కారోబార్‌ల మధ్యలో గొడవకు దారితీసింది.