టీ.నగర్: హిజ్రాగా మారేందుకు తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఆవేదనకు గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై విరుగంబాక్కంకు చెందిన కూలి కార్మికుడు మహేంద్రన్. ఇతని కుమారుడు పార్థసారథి (21) బీసీఏ చదివాడు. ఇతని వైఖరిలో ఇటీవల కాలంగా కొంత మార్పు కనిపించింది. మహిళలకు సంబంధించిన హావ భావాలు, వస్త్రాలు ధరించి కనిపించేవాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అతన్ని మందలించారు. అయినప్పటికీ పార్థసారథి తన వైఖరిని మార్చుకోలేదు.
మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పార్థసారథి బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు అతని కోసం అనేక చోట్ల గాలించారు. ఇలా ఉండగా, మనలిలో అతడు హిజ్రాలతో కలిసి ఉన్నట్లు తెలిసింది. తల్లిదండ్రులు తన కోసం గాలిస్తున్నట్లు తెలుసుకున్న అతను, తనను ఇంటికి తీసుకెళతారన్న భయంతో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీని గురించి సమాచారం అందుకున్న మనలి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment