
కట్టెల శ్రీనివాస్ (ఫైల్)
పహాడీషరీఫ్: పానీ పూరీ బండి అద్దాన్ని చేతితో పగులగొట్టేందుకు యత్నించి తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై నాగేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.తుక్కుగూడ గ్రామానికి చెందిన కట్టెల శ్రీనివాస్(28) పెట్రోల్ పంప్‌లో పని చేసేవాడు. బుధవారం రాత్రి అతను స్థానిక సిండికేట్ బ్యాంక్ సమీపంలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరి నిర్వాహకుడు బాబురావును పానీపూరి ఇవ్వాలని కోరాడు.
అందుకు అతను నిరాకరించడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ అతనితో వాగ్వాదానికి దిగాడు. కోపం పట్టలేక పానీ పూరీ బండి అద్దంపై బలంగా కొట్టడంతో అద్దం పగిలి అతని మోచేతికి గుచ్చుకుంది. నరం తెగడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతడిని విజయ సాయి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కాగా అతడి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ అతడి సోదరుడు గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment