
భార్య, పిల్లలతో మృతుడు(ఫైల్)
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): జక్కంపూడి కాలనీలో ఓ యువకుడు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని కోతాడి పాండురంగారావు(29) భార్య సీత, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. పాండురంగారావు పందులు పెంపకంతో పాటు చేపలు విక్రయించుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్రం పాండురంగారావు తన బ్లాక్ సమీపంలోని 272 బ్లాక్ పక్కన నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌పైకి ఎక్కాడు.
అయితే అదే బ్లాక్‌లో కొంత మంది పేకాట ఆడుతున్నారు. కాలనీలోని అవుట్ పోస్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు రాగా బ్లాక్ కింద ఉన్న వారు పోలీసులు, పోలీసులు అని గట్టిగా కేకలు వేశారు. మేడపై ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. దీంతో అపార్టుమెంట్‌పై ఉన్న పాండురంగారావు కంగారుగా కిందకు దిగుతూ రెండో అంతస్తు పై నుంచి జారిపడ్డాడు. దీంతో పాండురంగారావు తల రాయికి తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాండురంగారావు భార్య, పిల్లలు , ఇతర బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కొత్తపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment