
రెండు కాళ్లు విరిగిన తిపిరిశెట్టి పవన్
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనవాసనగర్‌లోని తిపిరిశెట్టి రాజు ఇంట్లో కింది పోర్షన్‌లో తాటిపల్లి రమాదేవి (55) కొంత కాలంగా అద్దెకు నివాసం ఉంటుంది. భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఈ విషయాన్ని గమనించి పై అంతస్తులో ఉన్న రాజు కుమారుడు ఆమెను కాపాడేందుకు పై అంతస్తు నుంచి కిందకు దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒకేసారి దూకడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. రమాదేవి అప్పటికే 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పవన్‌ను కోదాడలో ఓ పైవేట్ వైద్యశాలకు తరలించి విరిగిన రెండు కాళ్లకు కట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment