దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు | Manju Warrier Complaint Against Director Sreekumar Menon He Booked Under IPC 509 | Sakshi
Sakshi News home page

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

Published Thu, Oct 24 2019 8:43 AM | Last Updated on Thu, Oct 24 2019 9:13 AM

Manju Warrier Complaint Against Director Sreekumar Menon He Booked Under IPC 509 - Sakshi

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్‌ ఫిర్యాదు మేరకు దర్శకుడు శ్రీకుమార్ మీనన్‌పై కేసు నమోదైంది. మంజు వారియర్‌ వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. ఐపీసీ 509 సెక్షన్‌తో పాటు వివిధ సెక్షన్ల కింద శ్రీకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు కేరళ డీజీపీ లోక్‌నాథ్‌ బెహరా తెలిపారు. త్రిసూర్‌ ఈస్ట్‌ పోలీసు స్టేషనులో కేసు నమోదైందని... ఈ మేరకు క్రైం బ్రాంచ్‌ పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. కాగా తన భర్త, నటుడు దిలీప్‌ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మంజు వారియర్‌ కెరీర్‌ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో తాను దర్శకత్వం వహించిన షార్ట్‌ ఫిల్మ్‌, అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా శ్రీకుమార్‌ ఆమె కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చాడు.ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వివిధ సినిమాలకు పనిచేశారు. అయితే కొన్ని రోజుల క్రితం వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. శ్రీకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఒడియన్‌ సినిమాలో మంజు వారియర్‌ కీలక పాత్ర పోషించారు. 

ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ సమయంలో శ్రీకుమార్‌ తనను అసభ్యంగా దూషించాడని.. తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీ నుంచి వెళ్లగొడతానని... ఆ తర్వాత చంపేస్తానని శ్రీకుమార్ బెదిరించాడని ఆమె ఆరోపించారు. అదే విధంగా సోషల్‌ మీడియాలో తన గురించి అసత్యాలు ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తమిళ స్టార్‌హీరో ధనుష్‌ సరసన మంజు వారియర్‌ హీరోయిన్‌గా నటించిన ‘అసురన్‌’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా కేసు విషయంపై స్పందించిన శ్రీకుమార్‌ కఠిన సమయాల్లో తోడుగా ఉండి.. మంజు వారియర్‌కు అండగా నిలిచానని.. అయినా ఆమె తనపై ఫిర్యాదు చేయడం బాధాకరం అన్నాడు. తనపై కేసు నమోదైన విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నానని.. పోలీసులకు సహకరిస్తానని తెలిపాడు. ఇక మంజు వారియర్‌ భర్త దిలీప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రముఖ మలయాళ హీరోయిన్‌ను అపహరించి.. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement