ఏలూరు టౌన్: సీరియల్ సైనైడ్ కిల్లర్ వెల్లంకి సింహాద్రి హత్యలు చేయటంలో ఆరితేరిపోయాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తినే పదార్థంలో సైనైడ్ పెట్టి తినిపిస్తే అది పోస్టుమార్టంలో సైతం తెలియదా? ఈ విషయం తెలిసే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు వంగాయగూడెంకు చెందిన ఫైనాన్స్ ఆఫీస్‌లో గుమస్తాగా పనిచేసే చోడవరపు సూర్యనారాయణ హత్య అనంతరం అతని మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో సైతం అది సహజ మరణంగానే నిర్థారణ కావటం అంతుచిక్కని అంశంగా మారింది. విష ప్రయోగం ఏమీ జరగలేదని ఎఫ్‌ఎల్‌సీ రిపోర్టులో రావటం కూడా అనుమానాలకు దారితీస్తోంది.
పరిచయాలతోనే బోల్తా..
సింహాద్రి చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. పైకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దురాగతాలకు పాల్పడడం ప్రారంభించాడు. ఐదేళ్ల క్రితమే ఏలూరు వచ్చిన సింహాద్రి మెల్లగా ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పరిచయాలు పెంచుకుంటూ వచ్చాడు. వ్యక్తులను మోసం చేసే సమయంలో డబ్బు, బంగారం దోచుకోవాలంటే పెనుగులాట జరిగితే, ఒంటిపై గాయాలు ఉంటే పోలీసులు అనుమానిస్తారనే విషయాన్ని గ్రహించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆఖరికి సాధారణ పోస్టుమార్టం రిపోర్టులోనూ ఏవిధమైన అనుమానం రాదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయిలో వినూత్నరీతిలో హత్యలకు ప్రణాళికలు రచించాడు. కేవలం పక్షం రోజుల వ్యవధి మాత్రమే తీసుకుంటూ అత్యంత చాకచక్యంగా హత్యలు చేయటం మొదలెట్టాడు. హత్యల్లో ఏ విధమైన అనుమానాలు రాకుండా పొటాషియం సైనైడ్‌ను ఎంచుకున్నాడు. మృతుని శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ప్రత్యేక రీతిలో పరీక్షిస్తే తప్ప విషప్రయోగం జరిగిందనే విషయం నిర్థారణ కాదని అంటున్నారు. పీఈటీ కాటి నాగరాజు హత్య అనంతరం శవపరీక్షలో ఇదే విధమైన రిపోర్టు రాగా, ఎఫ్‌ఎల్‌సీ ద్వారానే అసలు విషయం బయటపడిందని పోలీస్‌వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎఫ్‌ఎల్‌సీ రిపోర్టులో నిర్ధారణ..
ఒక వ్యక్తిపై విషప్రయోగం జరిగితే దాని మోతాదు, చనిపోయిన సమయం, పోస్టుమార్టం నిర్వహించిన సమయం ఆధారంగా రిపోర్టు ఉంటుంది. సైనైడు వినియోగిస్తే ఒక్కోసారి సాధారణ పోస్టుమార్టంలో విషప్రయోగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అప్పుడు మృతుడి శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే విషప్రయోగం జరిగిందా? లేదా? అనేది తెలుస్తుంది. వ్యక్తిపై ప్రయోగించిన విషప్రయోగం మోతాదు ఆధారంగానూ కొన్నిసార్లు నిర్థారణ చేయవచ్చు. గుండె, కాలేయం, కిడ్నీ, జీర్ణాశయం పైనా వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటాయి. ఒక్కోసారి మరుసటి రోజు శవ పరీక్ష నిర్వహిస్తే విషప్రయోగం నిర్థారణలో తేడాలు రావచ్చు. ఇలా విషపదార్థం, మోతాదు, శవపరీక్ష చేసే కాలం ఇలా అనేక కోణాల్లో నిర్థారణపై ప్రభావం ఉంటుంది.
– డాక్టర్ హరికృష్ణ, ప్రభుత్వాసుపత్రి వైద్యుడు
వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం?
ఇక సీరియల్ కిల్లర్ సింహాద్రి 2018 ఫిబ్రవరిలో హత్యల పరంపర మొదలు పెట్టి వరుసగా 6 హత్యలు చేస్తూ వచ్చాడు. ఒక్కో హత్యకు సింహాద్రి కేవలం 9 నుంచి 15 రోజులు, మరో హత్యకు 20 రోజులు మాత్రమే సమయం తీసుకున్నాడు. రాజమండ్రి పురుషోత్తపట్నం ఆశ్రమంలో రామకృష్ణానంద స్వామీజిని 2018 ఏప్రిల్ 28న హత్య చేసిన అనంతరం సుమారుగా 8 నెలల వరకూ ఎక్కడా హత్యలు చేసినట్లు పోలీసు విచారణ వెల్లడి కాలేదు. అంటే ఈ 8 నెలల కాలం సింహాద్రి ఎక్కడ ఉన్నాడు.. ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా తన క్రిమినల్ కార్యకలాపాలు సాగించాడా? అనేది సందేహంగా మారింది. తరువాత 2018 డిసెంబర్ 23న 7వ హత్య, వెంటనే 20 రోజుల వ్యవధిలోనే 2019 జనవరి 12న 8వ హత్య చేశాడు. ఈ రెండు సంఘటనల అనంతరం సింహాద్రి మరోసారి 7 నెలల పాటు ఏ విధమైన నేరపూరిత చర్యలకు పాల్పడినట్లు తెలియటంలేదు. ఈ సమయంలో సింహాద్రి ఎక్కడ ఉన్నాడు ? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగించాల్సి ఉంది. నిందితుడు 2019 ఆగస్టు 30న 9వ హత్య, మళ్లీ నెలన్నరలోనే పదో హత్య అక్టోబర్ 16న చేసినట్లు పోలీసు విచారణ తేలింది. ఇవన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి. అసలు సీరియల్ కిల్లర్ సింహాద్రి కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాడా? అతను ఒక్కడే ఇన్ని హత్యలు చేశాడా? సింహాద్రి వెనుక ఏమైనా గ్యాంగ్ పనిచేస్తుందా అనేవి తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment